బెజవాడలో కరోనా నిర్ధారణ కేంద్రం
ABN , First Publish Date - 2020-03-16T10:33:44+05:30 IST
బెజవాడలో కరోనా నిర్ధారణ కేంద్రం
విజయవాడ, ఆంధ్రజ్యోతి: కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఇకపై విజయవాడలోనే చేయనున్నారు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజీలోని వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నొస్టిక్ లేబొరేటరీలోనే కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ యంత్రాంగం రూ. 23 లక్షలతో కొత్తగా రియల్ టైమ్ పోలిమెరేజ్ చెయిన్ రియాక్షన్ (ఆర్‌టీపీసీఆర్) పరికరాన్ని ఏర్పాటు చేసింది. శనివారం నుంచే ఇక్కడ వైద్య నిపుణులు ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రయోగాత్మకంగా..
శని, ఆదివారాల్లో కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన ఏలూరుకు చెందిన ఒక వ్యక్తి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు బాధితుల శాంపిల్స్‌ను తీసుకువచ్చి ఎస్‌ఎంసీలోని వీఆర్‌డీఎల్ ల్యాబ్‌లో పరీక్షలు చేశారు. పరీక్షలు చేసిన విధానం, వచ్చిన ఫలితాల వివరాలను ల్యాబ్ అధికారులు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. మొదటి పది శాంపిల్స్ రిపోర్టులను పరిశీలించిన తర్వాత వాటిలో కచ్చితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్‌గా ఇక్కడే నిర్ధారణ పరీక్షలు చేయడానికి అనుమతులు ఇస్తారు. తర్వాత నుంచి కరోనా వైరస్ అనుమానిత కేసుల శాంపిల్స్‌కు పరీక్షలు చేసి పాజిటివ్, నెగెటివ్ రిపోర్టులను ఇక్కడే వెల్లడిస్తారు. దీంతో సమయం ఆదా అవుతుంది. వెంటనే చికిత్స ప్రారంభించడానికి వీలవుతుంది. విజయవాడ ల్యాబ్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కరోనా వైరస్ నిర్ధ్థారణ పరీక్షలను బాగానే నిర్వహిస్తున్నారని, రిపోర్టుల్లో కచ్చితత్వం కనిపిస్తుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (పుణె) నిపుణులు ఇప్పటికే సంతృప్తి వ్యక్తం చేశారని, వీలైనంత త్వరలోనే అనుమతులు వస్తాయని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పి.నాంచారయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కరోనా అనుమానితుల శాంపిల్స్‌ను తీసి తిరుపతి లేదా హైదరాబాదులో ఉన్న ల్యాబ్‌కు పంపిస్తున్నారు. అక్కడ పరీక్షల తర్వాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (పుణె)కు పంపించి నిర్ధారించుకున్న తర్వాత ఆ రిపోర్టులు తిరిగి వస్తున్నాయి. ఎంత వేగంగా చేసినా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూడు రోజులు పడుతుంది. ఇకపై నగరంలోనే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కేవలం ఒక రోజులోనే రిపోర్టులు ఇవ్వడానికి వీలవుతుందని ఎస్‌ఎంసీలోని వీఆర్‌డీఎల్ ల్యాబ్ నిపుణులు చెబుతున్నారు.
పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నాం : కలెక్టర్
జిల్లాలో కరోనా (కోవిడ్-19) వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలోని వీఆర్‌డీఎల్ ల్యాబ్‌లో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల తీరును ఆదివారం కలెక్టరు ఇంతియాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టీఎస్‌ఆర్ మూర్తి పరిశీలించారు. కల్టెరు మాట్లాడుతూ కరోనా వ్యాధిని ప్రాథమిక దశలోనే నిర్ధారించుకునేందుకు ఈ ల్యాబ్‌లోనే కొత్తగా ఆర్‌టీపీసీఆర్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కరోనా వ్యాధి, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని కలెక్టరు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాంచారయ్య, వీఆర్‌డీఎల్ ల్యాబ్ నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ లక్ష్మీకుమారి ఈ ల్యాబ్ ప్రత్యేకతలను కలెక్టరు, డీఎంహెచ్‌వోలకు వివరించారు.