మొక్కజొన్న రైతుకు వర్షం దెబ్బ!

ABN , First Publish Date - 2020-11-06T16:21:31+05:30 IST

భారీ వర్షాలు మొక్కజొన్న రైతుల నడ్డి విరిచాయి. దిగుబడి తగ్గటమే..

మొక్కజొన్న రైతుకు వర్షం దెబ్బ!

ఎకరాకు 15 క్వింటాళ్లకు తగ్గినదిగుబడి

ఆరబెట్టిన మొక్కజొన్న తడిసిన వైనం

లబోదిబోమంటున్న రైతులు


కంచికచర్ల(కృష్ణా): భారీ వర్షాలు మొక్కజొన్న రైతుల నడ్డి విరిచాయి. దిగుబడి తగ్గటమే కాకుండా ఆ పంట కూడా చేతికి దక్కని దుస్థితి నెలకొన్నది. ఆరబోసిన గింజలు వర్షార్పణమయ్యాయి. కళ్ల ముందే పంట దెబ్బతినటంతో రైతులు అల్లాడిపోతున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో మొక్కజొన్న పంట ఎకరాకు 25 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆశాజనకమైన దిగుబడి రావటంతో మెట్టప్రాంతంలో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగు చేశారు. కౌలు కాకుండా ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేలు పెట్టుబడి అయింది. పంటపై తొలుత కత్తెర పురుగు దాడి చేసింది. దీనికితోడు కండెలు ముదురుతున్న తరుణంలో రోజుల తరబడి భారీ వర్షాలు పడటంతో పంట దెబ్బతిన్నది. ఫలితంగా దిగుబడి బాగా తగ్గింది. కొద్ది రోజుల నుంచి కోతలు జరుగుతున్నాయి. ఎకరానికి 15 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. యంత్రాలతో పంట కోయిస్తున్నందున ఎక్కువ తేమ లేకుండా గింజలు కొద్ది రోజులు ఎండలో ఆరబెట్టాల్సి ఉంది. కొంత మంది రైతులు కంచికచర్ల యార్డులో, ఇంకొంత మంది రైతులు బైపాస్‌ రోడ్డుపై కిలోమీటర్ల పొడవున మొక్కజొన్న కండెలు ఆరబెట్టారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో గంటల తరబడి జల్లులు పడ్డాయి.


రైతులు టార్ఫాలిన్‌ పట్టాలు కప్పటానికి కూడా వీలుపడలేదు. కొంత మంది కప్పినప్పటికీ బలంగా వీచిన ఈదురుగాలులకు లేచిపోయాయి. మొత్తం ఏడు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కల్లాల్లోని మొక్కజొన్నలు తడిచాయి. బుధవారం ఉదయం ఎక్కడ చూసిన రైతులు, కూలీలు ఉరుకులు, పరుగులు పెడుతూ నీళ్లను బయటకు పంపిస్తూ మొక్కజొన్నలను ఆరబెట్టడంలో నిమగ్నమయ్యారు. తడవటం వల్ల అప్పటికే మొక్కజొన్నల నుంచి భరించలేని దుర్గంధం వస్తోంది. పండిన పంట కూడా చేతికి అందే సమయంలో దెబ్బతిన్నది. కళ్ల ముందే పంట నాశనం కావటంతో రైతులు అల్లాడిపోతున్నారు. నాణ్యతతో సంబంధం లేకుండా మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాల్సిందిగా రైతులు వేడుకుంటున్నారు.

Updated Date - 2020-11-06T16:21:31+05:30 IST