ఇంద్రకీలాద్రిపై కాంటూరు డ్రెయిన్లు

ABN , First Publish Date - 2020-11-03T15:17:50+05:30 IST

ఇంద్రకీలాద్రిపై నుంచి రాళ్లు జారిపడకుండా..

ఇంద్రకీలాద్రిపై కాంటూరు డ్రెయిన్లు

హైడ్రో సీడింగ్‌తో పాటు వైర్‌మెస్‌

నిపుణుల కమిటీ సూచనలు

కొండరాళ్లు జారి పడకుండా సలహాలు


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై నుంచి రాళ్లు జారిపడకుండా శాశ్వత చర్యలు చేపట్టే ప్రక్రియకు దుర్గగుడి అధికారులు శ్రీకారం చుట్టారు. నలుగురు భూగర్భ శాస్త్ర నిపుణులతో కూడిన కమిటీ సోమవారం కొండను పరిశీలించింది. కాన్పూర్‌ ఐఐటీ ప్రొఫెసర్‌, హైదరాబాద్‌ ఐఐటీ విజిటింగ్‌ ప్రొఫెసర్‌ ఎంఆర్‌ మాధవ్‌, రిటైర్డ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) కొండలరావు, బెంగళూరు ఐఐఎస్‌సీ నుంచి జీఎల్‌ శివకుమార్‌, ప్రముఖ జియాలజిస్టు త్రిమూర్తిరాజు ఈ కమిటీలో సభ్యులు. ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు జారిపడకుండా ఉండేందుకు వీరి సలహాలు కోరారు. ఘాట్‌రోడ్డు నుంచి పరిశీలించిన నిపుణులు కొండరాళ్లు జారిపడటం (రాక్‌ ఫాలింగ్‌) సాధారణమని, దీనికి శాశ్వత పరిష్కారమంటూ ఏదీ ఉండదని తేల్చి చెప్పారు. అయితే, రాళ్లు జారిపడకుండా నివారించేందుకు ప్రాథమికంగా కొన్ని నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. 


నిపుణుల సూచనలివీ.. 

వర్షపునీరు కొండపై నిలిచిపోయి లోపలికి ఇంకిపోతుండటం వల్ల మట్టి కరిగిపోయి కొండరాళ్లు జారిపడుతున్నాయని, కాబట్టి నీరు నిలిచిపోకుండా కొండపై నుంచి కిందకు కాంటూరు డ్రెయిన్లు ఏర్పాటుచేస్తే మంచిదని సూచించారు. 


కొండపై గ్రీనరీని పెంచితే కొండ గుల్ల బారకుండా పటిష్టంగా ఉంటుందని, హైడ్రో సీడింగ్‌ (విత్తనాలు, ఎరువులను కొండప్రాంతమంతా చల్లడం) చేయాలని సూచించారు. 


కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల్లో వైర్‌మెస్‌తో కేబుల్‌ ఫెన్సింగ్‌ వేయాలన్నారు. అనంతరం దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.గిరిజాశంకర్‌, కమిషనర్‌ పి.అర్జునరావుతో నిపుణులు చర్చించారు. వారంలో సమగ్ర నివేదికను అందజేస్తామని చెప్పారు. దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో ఎంవీ సురేష్‌బాబు, ఈఈ డీవీ భాస్కర్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T15:17:50+05:30 IST