-
-
Home » Andhra Pradesh » Krishna » Congress Dharna
-
కాంగ్రెస్ నేతల అరెస్టు, గృహ నిర్బంధం
ABN , First Publish Date - 2020-12-06T06:04:49+05:30 IST
రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి విన్నవించడానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

విజయవాడ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి విన్నవించడానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లా నేతతో కాంగ్రెస్ పార్టీ అమరావతి పరిరక్షణ కమిటీని నియమించింది. గత నెల 20న తుళ్లూరులో బహిరంగ సభను నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు నేరుగా సీఎంను కలవాలని నిర్ణయించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశం నుంచి బయలుదేరి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోవాలని భావించారు. పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, సుంకర పద్మశ్రీ, షేక్ మస్తాన్ వలీ వంటి నేతలు గుం టూరు జిల్లా నుంచి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా శైలజానాథ్, సుంకర పద్మశ్రీని మంగళగిరిలో పోలీసులు అరెస్టు చేశారు. షేక్ మస్తాన్ వలీని గుంటూరులోనే గృహ నిర్బంధం చేశారు. విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహరావును వన్‌టౌన్‌లో గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావును గవర్నరుపేట పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బేషరతుగా విడుదల చేశారు.