అందుకే ఇక్కడ కేసులెక్కువ
ABN , First Publish Date - 2020-05-19T08:28:56+05:30 IST
రాష్ట్రంలోని మిగిలిన పట్టణాల కంటే విజయవాడ వేరు. అన్ని ప్రాంతాలకు విజయవాడ కేంద్ర స్థానం. విశాఖపట్నం ఎక్కడో దూరాన

విజయవాడ అన్ని కార్యకలాపాలకు కేంద్రం
ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో మనం టాప్
భయపడాల్సిన పనిలేదు.. అలా అని అజాగ్రత్త పనికిరాదు..
డిశ్చార్జిలు రికార్డు స్థాయిలో ఉన్నాయి
‘ఆంధ్రజ్యోతి’ ఫోన్ ఇంటర్వ్యూలో కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విజయవాడ కేంద్ర స్థానం. అందుకే ఇక్కడ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. కేసులు తగ్గుతున్నాయని తేలిగ్గా తీసుకోడానికి లేదు. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జిల్లాలో చాలా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ పరీక్షల వేగాన్ని ఇంకా పెంచటానికి చర్యలు చేపడుతున్నాం.. అని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆ వివరాలు..
విజయవాడలో తగ్గినట్టే తగ్గి కేసులు పెరుగుతున్నాయి..?
కలెక్టర్ : రాష్ట్రంలోని మిగిలిన పట్టణాల కంటే విజయవాడ వేరు. అన్ని ప్రాంతాలకు విజయవాడ కేంద్ర స్థానం. విశాఖపట్నం ఎక్కడో దూరాన ఉంటుంది. విజయవాడ అలా కాదు. ఈ ప్రాంతానికి అనేక రకాలుగా గుర్తింపు ఉంది. నగరంలో ఆటోమొబైల్ రంగం అన్ని ప్రాంతాల అవసరాలను తీరుస్తుంది. వర్తక, వాణిజ్య రాజధానిగానూ, వలస కార్మికులకు ఉపాధి కేంద్రంగానూ ఉంది. ఇక్కడ జరిగే కార్యకలాపాల వల్ల కరోనా ఎక్కువగా వ్యాపిస్తోంది. ఎలా విస్తరిస్తుందన్నది కూడా మనం చెప్పలేకపోతున్నాం. నియంత్రణలోకి తెచ్చేందుకు కంటైన్మెంట్ క్లస్టర్, బఫర్ ఏరియాలతో కూడిన రెడ్, ఆరెంజ్ జోన్లలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం.
ర్యాపిడ్ కిట్లతో ఇంకా ఎక్కువ పరీక్షలు నిర్వహించవచ్చు కదా?
కలెక్టర్ : ర్యాపిడ్ కిట్ల ద్వారా యాంటీబాడీ టెస్టులు నిర్వహించటం వల్ల అనుకున్న ఫలితం సరిగ్గా రావట్లేదని తెలుస్తోంది. దీంతో మిగిలిన రెండు పరీక్షలనే నిర్వహిస్తున్నాం. జిల్లాలో జరుగుతున్నన్ని పరీక్షలు ప్రపంచంలోనే ఎక్కడా జరగటం లేదు. ఈ పరీక్షలను ఇంకా రెట్టింపు చేయటానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం.
ప్రకాశం జిల్లా మాదిరిగా జీరో పర్సంట్‌కు ఇప్పట్లో తీసుకురాలేమా?
కలెక్టర్ : ఎన్ని ఎక్కువ కేసులు వస్తే అంత మంచిదనుకోవాలి. కరోనాను పూర్తిగా నిర్మూలించటానికి దోహదపడుతుంది. కేసులు లేవనుకుంటే తర్వాత జరిగే ప్రమాదం వెలకట్టలేనిది. అనుమానిత ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా కోరితే పరీక్షలు నిర్వహిస్తున్నాం. లక్షణాలతో బాధపడేవారు ఉంటే వారికీ పరీక్షలు చేస్తున్నాం. దీనివల్ల ఎక్కువ కేసులు వస్తుంటాయి. జీరోకు తీసుకురావటం మన చేతిలో లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో వీలైనన్ని కేసులను గుర్తించి వారికి నయం చేసి పంపించటమే ప్రధాన అంశం. మేము కేసులను గుర్తిస్తున్నాం. వారికి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నాం. జిల్లాలో 382 మంది రోగులకుగానూ 263 మందిని డిశ్చార్జి చేశాం. ఇది సాధారణ విషయం కాదు. వీటితో పాటు క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ, ఐసోలేషన్ వార్డుల నిర్వహణ, వలస కార్మికులు, ప్రవాసీయుల తరలింపు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో.. యాక్షన్ ప్లాన్ ఏంటి?
కలెక్టర్ : కరోనా గురించి భయం చెందాల్సిన అవసరం లేదు. అలాగని అజాగ్రత్తగానూ ఉండకూడదు. లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయి. కేసులు తక్కువగా ఉన్నా, పెరిగినా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నివారించే అవకాశం ఉంటుంది.