మార్చి 1కి భూమిని సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2020-02-12T09:44:41+05:30 IST

ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు, మార్చి 1 నాటికి అవసరమైన భూమిని సిద్ధం చేయాలని, 15 నాటికి లేఅవుట్లు, ప్లాట్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

మార్చి 1కి భూమిని సిద్ధం చేయండి

ఇళ్ల స్థలాల పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో 

     సీఎం జగన్మోహన్‌రెడ్డి


విజయవాడ సిటీ, ఫిబ్రవరి 11: ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు, మార్చి 1 నాటికి అవసరమైన భూమిని సిద్ధం చేయాలని, 15 నాటికి లేఅవుట్లు, ప్లాట్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లను కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం ఆయన సమీక్షించారు. ఇళ్ల స్థలాల కోసం ఇంకా 400 ఎకరాల భూమిని సేకరించాలని సీఎంతో కలెక్టర్‌ చెప్పారు. 100 ఎకరాలు సేకరించామని మిగిలిన 300 ఎకరాలను మార్చి నెలలోపు సేకరిస్తామన్నారు. వైఎస్సార్‌ కంటివెలుగు మూడో విడత అవ్వ- తాత  కార్యక్రమం తొలిదశలో 60 ఏళ్లు నిండిన 1,12,680 మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. స్పందించిన సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నియోజకవర్గాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

24న జగనన్న వసతి దీవెన

జిల్లాలో మార్చి 25 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసేందుకు, ఈ నెల 24న జగనన్న వసతి దీవెన ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం సూచించారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో పెన్షన్‌ కార్డులు అందించాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 6,14,244 పింఛన్లు ఇచ్చామన్నారు. అర్హత ఉండి రాని వారికి రెండు నెలల పింఛన్‌ ఒకేసారి అందిస్తామన్నారు. 17 నాటికి కలెక్టర్లు రీవెరిఫికేషన్‌ పూర్తి చేయించి, ఈ నెల 18 నాటికి వివరాలు అప్‌లోడ్‌ చేసి 19, 20 తేదీల్లో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించాలన్నారు. తుది జాబితా ఈ నెల 20 ప్రకటించి, మార్చి 1న కార్డుతో పాటు పింఛన్‌ అందించాలన్నారు. స్పందన, అమ్మ ఒడి, నాడు-నేడు కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ బి.రామారావు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, జేసీ మాధవీలత, జేసీ-2 మోహన్‌కుమార్‌, డీఆర్వో ప్రసాద్‌, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో సూర్యప్రకాష్‌, డ్వామా పీడీ సూర్యనారాయణ, డీఈవో రాజ్యలక్ష్మి, ఐసీడీఏసీ పీడీ భార్గవి, వ్యవసాయశాఖ జేడీ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-12T09:44:41+05:30 IST