ఎట్టకేలకు చింతలపూడి-2 పునఃప్రారంభం

ABN , First Publish Date - 2020-12-13T05:59:00+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2 పనులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభం కావటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎట్టకేలకు చింతలపూడి-2 పునఃప్రారంభం
రిటైనింగ్‌వాల్‌ సెంట్రింగ్‌ పనులుచేస్తున్న కూలీలు

చాట్రాయి డిసెంబరు12 : వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2 పనులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభం కావటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.4909కోట్లతో చేపట్టిన పనులు గత ప్రభుత్వ హయాంలోనే సుమారు 50 శాతం పూర్తయ్యాయి. మిగతా పనులు త్వరితగతిన పూర్తిచేసి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలని రైతులు కోరుతున్నారు. చింతలపూడి ఫేజ్‌-1 కాలువ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం యర్రగుంటపల్లి వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి 13.8 కిలోమీటర్లు కాలువతవ్వి ఎన్నెస్పీ వేంపాడు మేజర్‌ కాలువకు గోదావరి జలాలు అనుసంధానం చేయటానికి చింతలపూడి-2 పేరుతో డిజైన్‌ రూపొందించారు. ఈ పథకం వల్ల పశ్చిమకృష్ణాలో నూజివీడు, మైలవరం, తిరువూరు, గన్నవరం, నందిగామ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందుతుంది. టీడీపీ హయాంలో అప్పటి భారీ నీటిపారుదలశాఖామంత్రి దేవినేని ఉమా కృషితో నిధులు మంజూరయ్యాయి. 2017 సెప్టెంబరు 7వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విస్సన్నపేట సమీపంలో శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు ప్రారంభించి తమ హయాంలో నీరు ఇవ్వాలని గట్టిప్రయత్నం చేశారు. కానీ ఎన్నికలు వచ్చి అధికారం కోల్పోవటంతో పథకానికి గ్రహణం పట్టింది. నిర్వాసిత రైతులకు ఇంకా రూ.30కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. 13.8కిలోమీటర్ల కాలువ తవ్వాల్సి ఉండగా కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే తవ్వారు. చీపురుగూడెం వద్ద తమ్మిలేరుపై నిర్మిస్తున్న అక్విడెట్‌ పనులు చాట్రాయి వద్ద నుంచి విస్సన్నపేట మండలం రామచంద్రాపురం 117 హెడ్‌రెగ్యులేటర్‌ వరకు 10 కిలోమీటర్లు వేంపాడు మేజర్‌ విస్తరణ పనుల్లో 80 శాతం పూర్తి ఆయ్యాయి. నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లించి పనులు పూర్తిచేసి ఆయకట్టుకు గోదావరి జలాలు అందించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.

రేపు ఉపాధి హామీ ప్రజావేదిక 

చాట్రాయి మండల పరిషత్‌ ఆవరణలో 14వ తేదీ ఉదయం 10గంటలకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు ఎమ్డీవో నాగేశ్వరావు తెలిపారు


Updated Date - 2020-12-13T05:59:00+05:30 IST