డబ్బు విషయమై ఘర్షణ.. చివరకు అనాథలైన ఇద్దరు చిన్నారులు

ABN , First Publish Date - 2020-06-19T16:54:50+05:30 IST

డబ్బు విషయమై భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో..

డబ్బు విషయమై ఘర్షణ.. చివరకు అనాథలైన ఇద్దరు చిన్నారులు

భార్య మృతి, భర్త ఆత్మహత్య

అల్లుడే హత్య చేశాడని మామ ఫిర్యాదు


చల్లపల్లి(విజయవాడ): డబ్బు విషయమై భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భార్య మృతి చెందగా, భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన డేగల పిచ్చియ్యకు పెడన మండలం పోసినవారిపాలెంకు చెందిన వాకా పెంటయ్య కుమార్తె దేవీ రాజేశ్వరితో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు మగపిల్లలు. ఇటీవలే పోసినవారిపాలెం నుంచి మంగళాపురం వచ్చారు. పిచ్చియ్య తాపీ కార్మికునిగా జీవిస్తున్నాడు. కొంతకాలం క్రితం రాజేశ్వరి తల్లి మృతి చెందగా, ఆమెకు నామినీగా ఉన్న రాజేశ్వరికి రూ.రెండు లక్షల బీమా పరిహారం వచ్చింది.


ఈ డబ్బును పిచ్చియ్య వాడుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ తలెత్తడంతో రాజేశ్వరి మృతి చెందింది. గురువారం ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లిపోయిన  పిచ్చియ్య భోగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గుళికలుతిని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు ఏడుస్తూ ఉండటంతో గమనించిన స్థానికులు ఇంటికి వచ్చి చూడగా, రాజేశ్వరి మృతి చెంది ఉంది. బంధువులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల మృతితో అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మిగిలారు. తన కుమార్తెను అల్లుడే హతమార్చి ఉంటాడని  రాజేశ్వరి తండ్రి పెంటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అవనిగడ్డ డీఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి, తహసీల్దార్‌ కె.స్వర్ణమేరి, సీఐ భీమేశ్వర రవికుమార్‌ పర్యవేక్షణలో పంచనామా నిర్వహించారు. చల్లపల్లి ఎస్సై  నాగరాజు, మచిలీపట్నం తాలూకా ఎస్సై లక్ష్మీ నరసింహమూర్తి  వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2020-06-19T16:54:50+05:30 IST