కరోనా వేళ.. కిరాయి లేక!

ABN , First Publish Date - 2020-07-28T09:50:11+05:30 IST

పెరిగిపోతున్న అప్పుల భారం భరించలేక రవాణా రంగ వాహన యజమానులు ఆత్మహత్యల బాట పడుతున్నారు.

కరోనా వేళ.. కిరాయి లేక!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):  పెరిగిపోతున్న అప్పుల భారం  భరించలేక రవాణా రంగ వాహన యజమానులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. కరోనా వేళ కిరాయిలు లేక ఆర్థికంగా చితికిపోయి పన్నులు చెల్లించలేక, ఫైనాన్షియర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలే శరణ్యమన్న నైరాశ్యంలోకి వెళ్లి పోతున్నారు. సోమవారం కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం ముళ్లపూడి గ్రామానికి చెందిన చోడిశెట్టి శివమల్లేశ్వరరావు అనే ట్రావెల్స్‌ నిర్వాహకుడు ముఖ్యమంత్రి జగన్‌కు ఓ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.


ఈ పరిణామంతో కార్‌ ట్రావెల్స్‌, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నేతలు దిగ్ర్భాంతి చెందు తున్నారు. వారం కిందట గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఓ లారీ యజమాని తాను లారీకి ఉరేసుకుని చనిపోతానంటూ ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నేతలకు ఫోన్‌ చేయటంతో కలకలం రేగింది. దీంతో సదరు లారీ యజమానిని గుర్తించి ఆత్మహత్యా ప్రయ త్నాన్ని నిర్వీర్యం చేయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన వారానికే శివమల్లేశ్వర రావు ఆత్మహత్య రవాణా రంగాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. మూడు కార్లతో ఓ చిన్న ట్రావెల్స్‌ను నడుపుతున్న శివమల్లేశ్వరరావు తన ఆత్మహత్యకు సంబంధించి సీఎం జగన్‌కు 4 పేజీల లేఖను రాశారు.


తన ఆత్మహత్య ద్వారా తోటి ఆపరేటర్లకైనా న్యాయం జరుగుతుందని ప్రస్తావించటం  గమనార్హం. కరోనా వేళ కిరాయిలు లేని పరిస్థితుల్లో శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజర్‌ సుధాకర్‌ తనను ఈఎంఐలు కట్టాలని, లేదంటే వాహనాలు అప్పగించాలని ఒత్తిడి చేశార న్నాడు. పోనీ వాహనాలు ఇచ్చేద్దామంటే అందులోనూ మోసం జరుగుతోందని, శ్రీరామ్‌ ఆటోమాల్‌లో లోకల్‌ డీలర్స్‌తో కలిసి తక్కువ రేటుకు అమ్మి తర్వాత నష్టం వచ్చిందని మిగిలిన మొత్తం కట్టాలని వేధిస్తుం టారన్నారు. అంతేకాక ఇచ్చిన చెక్కులను బౌన్స్‌ చేసి కేసులు వేస్తుంటారన్నాడు. ఇవన్నీ చూసి భయంతో తాను తనువు చాలిస్తున్నానని లేఖలో తెలిపాడు. తన స్నేహితుల్లోనే మోసగాళ్లున్నారని  నాగరాజు, శివ అనే ఇద్దరూ చింతయ్య దగ్గర రూ.10ల వడ్డీకి రూ.10 వేలు ఇప్పించగా మూడో నెలలోనే రూ.10వేలను నాగ రాజుకు ఇచ్చానని, ఆ డబ్బులను తాను వాడేసు కోవటంతో 8ఏళ్లుగా వడ్డీ కడుతూనే ఉన్నానన్నారు.


మధ్యలో ఈ ఇద్దరూ తనకు రూ.7వేలు అప్పు ఇచ్చి తన వాహనాలను సొంత వాహనాలుగా ఉపయోగిం చుకుంటూనే ఒక్క రూపాయి చెల్లించలేదన్నాడు. పైగా తన టూ వీలర్‌ను సీజ్‌ చేయించారన్నాడు. ఉయ్యూరులో  సందీప్‌ అనే వ్యక్తి దగ్గర రూ. 20 వేలు అప్పు తీసుకుని రూ. 1,06,000 చెల్లించానని, అయునా ఇంకో రూ.లక్ష చెల్లించి నోటు, చెక్కును తీసుళ్లాలని వేధించాడన్నారు. మారటోరియం ఉన్నా ఫైనాన్స్‌ సంస్థలు, వడ్డీ వ్యాపారులు తన మీద ఒత్తిడి తీసుకురావటంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. 


 మిగతా వాళ్ల పరిస్థితీ

 ఇంచుమించుగా ఇంతే!

రవాణా రంగంలో బిగ్‌ బల్క్‌ ట్రాన్స్‌పోర్టర్లను మినహాయిస్తే చిన్న, మధ్య తరహా ట్రాన్స్‌పోర్టర్లందరి పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. నాలుగైదు లారీ లున్నవారు, మూడు అంతకు మించి కార్లతో ట్రావె ల్స్‌ను నడుపుకునే వారు ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ఆత్మహత్యలే శరణ్యమన్న భావనలో అనేక మంది ఉన్నారు.  రవాణా రంగంలో రెండు, మూడేళ్లుగా దేశీయంగా జరుగుతున్న పరిణామాలతో సంక్షోభం అంచుకు చేరుతూ వస్తోంది.


కరోనా దెబ్బకు వెంటిలేటర్‌పై ఉంది. ఆక్సిజన్‌ ఇస్తే తప్ప బతికే పరిస్థితి లేదు. నిన్నటి వరకు రవాణా రంగాన్ని బతికించాలని వేడుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని బతికించండి అంటూ బతిమాలుతున్నారు. లాభాలు తగ్గి ఖర్చులు పెరిగిపోవటంతో ఓనర్లే డ్రైవర్ల అవతారం ఎత్తుతున్నారు. కిరాయిలే లేక పన్నులు, ఈఎంఐలు ఫైనాన్షియర్ల ఒత్తిళ్లతో ఆత్మహత్యలకు దారి తీస్తున్నారు. ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2020-07-28T09:50:11+05:30 IST