-
-
Home » Andhra Pradesh » Krishna » capital farmer is JAC
-
ప్రభాత పోరు
ABN , First Publish Date - 2020-03-23T09:41:29+05:30 IST
అమరావతి కోసం రాజధాని రైతుల ఉద్యమం.. ఆగలేదు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా జనతా కర్య్పూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపును శిరసావహిస్తూనే, రాజధాని రైతులు, రైతుకూలీలు, మహిళలు ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు.

గుంటూరు/ తుళ్లూరు/తాడికొండ/ తాడేపల్లి/మంగళగిరి, మార్చి 22 : అమరావతి కోసం రాజధాని రైతుల ఉద్యమం.. ఆగలేదు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా జనతా కర్య్పూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపును శిరసావహిస్తూనే, రాజధాని రైతులు, రైతుకూలీలు, మహిళలు ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం 96వ రోజు వేకువనే ఉద్యమానికి కదిలారు. ఆ తరువాత జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తుళ్లూరు, మందడం, రాయపూడి, వెలగపూడి, యర్రబాలెం, కృష్ణాయపాలెం, నీరుకొండ, పెదపరిమి తదితర ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగించారు. ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ పిలుపు నేపథ్యంలో ఉదయం 5 గంటలకే దీక్షాశిబిరాలకు చేరుకుని జై అమరావతి నినాదాలు చేశారు.
శిబిరాల వద్దకు వైద్యాధికారులు, పోలీసులు వచ్చి కరోనాపై అవగాహన కల్పించారు. దీంతో ఏడు గంటలకల్లా ఇళ్లకు వెళ్లిపోయి ఎవరికివారు తమ ఇళ్ల వద్ద నిరసన దీక్షలు కొనసాగించారు. మందడం దీక్షాశిబిరంలో పలువురు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూను పాటిస్తున్నామని తెలిపారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తమ ఉద్యమం ఆగిపోదని తమ నిరసనలు ఇళ్ల వద్ద నుంచి వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు. యర్రబాలెం, కృష్ణాయపాలెం దీక్షాశిబిరాలకు ఉదయం ఆరు గంటల నుంచి రైతులు, రైతు కూలీలు చేరుకుని దూరం దూరంగా కూర్చొని గంటసేపు దీక్షలు చేపట్టారు. ఏడు గంటలకు దీక్షలను విరమించి ఇళ్లకు చేరుకున్నారు. నవులూరు, నిడమర్రు, నీరుకొండ గ్రామాలతోపాటు కృష్ణాయపాలెం, యర్రబాలెం గ్రామాల్లో సాయంత్రం అయిదు గంటలకు రైతులు, రైతుకూలీలు, గ్రామప్రజలు ఎవరి ఇళ్ల వద్ద వారు కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, పోలీస్ శాఖ సిబ్బంది సేవలను కొనియాడుతూ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు.
‘అమరావతి వెలుగు’
రాజధాని రైతు జేఏసీ పిలుపు మేరకు రాజధాని గ్రామాల రైతులు, మహిళలు ఆదివారం రాత్రి ‘అమరావతి వెలుగు’ పేరిట కొవ్వొతుల ప్రదర్శన నిర్వహించారు. రాత్రి 7.30 నుంచి 7.35 గంటల వరకు ఐదు నిమిషాలు ఇళ్లలో లైట్లు తీసేసి, అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ఎవరి ఇంటి ముందు వారు కొవ్వొత్తులు వెలగించి నిరసన ప్రదర్శనలు చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. రైతుల త్యాగలను అవహేళన చేయ వద్దు అంటూ నినాదాలు చేశారు. జై అమరావతి అంటూ ఇంటి ముందు ముగ్గులు పెట్టారు. యర్రబాలెంలో జేఏసీ నాయకుడు శివన్నారాయణ ఆధ్వర్యంలో రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఉండవల్లిలో జనతా కర్ఫ్యూకి మద్దతు తెలియజేస్తూ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రాత్రి కొవ్వొత్తులతో నిర్వహించిన ప్రదర్శనలో స్థానిక రైతులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.