రేపు సాయంత్రం దుర్గగుడి మూసివేత

ABN , First Publish Date - 2020-11-13T11:24:47+05:30 IST

దీపావళి పర్వదినం సందర్భంగా శనివారం సాయంత్రం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని మూసివేయనున్నారు.

రేపు సాయంత్రం దుర్గగుడి మూసివేత

 విజయవాడ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : దీపావళి పర్వదినం సందర్భంగా శనివారం సాయంత్రం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని మూసివేయనున్నారు. అమ్మవారికి పంచహారతుల అనంతరం రాత్రి ఏడు గంటలకు దేవస్థానాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున యథావిధిగా అమ్మవారి ఆలయాన్ని తెరుస్తారు. సాయంత్రం ప్రదోష కాలంలో అమ్మవారి ప్రధానాలయంతోపాటు శివాలయం, నటరాజస్వామి దేవస్థానాల్లో ‘ఆకాశ దీపం’ ఏర్పాటు చేయనున్నారు.


కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 16వ తేదీన దుర్గమ్మకు వివిధ రంగుల గాజులతో విశేష అలంకారం చేయనున్నారు. కరోనా కారణంగా అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని మాత్రమే గాజులతో అలంకరించా లని వైదిక కమిటీ నిర్ణయించింది. ఆ రోజు నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆకాశ దీపం ఏర్పాటు, లక్ష్మీగణపతి పంచాక్షరీ పఠనాలు, ప్రత్యేక బిల్వార్చనలు, లక్ష బిల్వార్చనలు, సహస్ర లింగార్చనలు, త్రికాల అభిషేకాలు నిర్వహించనున్నారు. 18న నాగులచవితి సందర్భంగా వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్వేశ్వరస్వామి ఆలయంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 29న కార్తీక పౌర్ణమి సందర్భంగా కొండపై దీపోత్సవం, శివాలయంలో సాయంత్రం ఏడు గంటలకు జ్వాలాతోరణం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-11-13T11:24:47+05:30 IST