చింతలమడ డ్రెయినేజీ భూముల్లో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-11-07T07:33:42+05:30 IST

మండలంలోని లక్ష్మీపురం శివారు చింతలమడ డ్రెయినేజీ పోరంబోకు భూముల్లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

చింతలమడ డ్రెయినేజీ భూముల్లో ఉద్రిక్తత

 ఇరువర్గాల ఘర్షణ, తోపులాట 

చల్లపల్లి, నవంబరు 6 : మండలంలోని లక్ష్మీపురం శివారు చింతలమడ డ్రెయినేజీ పోరంబోకు భూముల్లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సదరు భూములను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని గత సాగుదారులకు, పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యకాస రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు యద్దనపూడి మధు, కార్యదర్శి మురాల రాజేష్‌ తదితర నేతలు గత సాగుదారులతో కలిసి వ్యవసాయ భూమిలోకి వెళ్లి వరిని కోసి విత్తనాలు చల్లుతుండగా, ఆక్రమిత రైతులు, వారి అనుయాయులు అడ్డగించారు.


దీంతో ఇరువర్గాల నడుమ వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. తహసీల్దార్‌ కె.స్వర్ణమేరి, చల్లపల్లి సీఐ ఎన్‌.వెంకట నారాయణ, ఎస్‌ఐ పి.నాగరాజు, ఆర్‌ఐ ఐ.శివరామకృష్ణ, వీఆర్వోలు బెల్లంకొండ గోపీకృష్ణ, ఘంటసాల కృష్ణమోహన్‌, పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని ఇరువర్గాలకు సర్ధిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఇరువర్గాలను తన కార్యాలయానికి రావాల్సిందిగా తహసీల్ధార్‌ సూచించారు. అక్కడ జరిగిన సమావేశంలో తహసీల్దార్‌ స్వర్ణమేరి మాట్లాడుతూ ఆర్డీవో ఆదేశాలతో చింతలమడ భూములను సర్వే చేస్తున్నామని, నోటీసులు జారీ చేసి నిర్ణీత గడువులోగా ఆధారాలు సమర్పించకుంటే ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని వ్యకాస నేతలకు స్పష్టం చేశారు.


వ్యకాస రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దీపావళి నాటికి ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలనీ లేకుంటే తామే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతామని స్పష్టం చేశారు. ప్రస్తుత సాగుదారులు మాట్లాడుతూ ఎంతో కష్టపడి సాగుచేసుకున్నామనీ, పంట చేతికొచ్చే వరకూ అధికారులు ఆగాలని కోరారు. అనంతరం సమావేశపు వివరాలను తహసీల్దార్‌ స్వర్ణమేరి ఆర్డీవో ఖాజావలికి తెలియచేశారు.

Updated Date - 2020-11-07T07:33:42+05:30 IST