తిరిగి.. తిరిగి అక్కడికే!

ABN , First Publish Date - 2020-10-31T08:22:23+05:30 IST

ఈ-పోస్‌ ద్వారా పారదర్శకత వచ్చిన తర్వాత కూడా అక్రమ బియ్యం నిల్వల గురించి తరచూ వింటున్నాం.

తిరిగి.. తిరిగి అక్కడికే!

 అంగట్లో ‘చౌక’ బియ్యం! ఫ దాడులతో సరిపెడుతున్న యంత్రాంగం 

 అయినా తగ్గని అక్రమ నిల్వలు ఫ అన్ని నిల్వలెక్కడివి? 


రేషన్‌ బియ్యం కార్డుదారులకే అందజేసేందుకు వీలుగా ఈ-పోస్‌ వచ్చింది. బియ్యం పక్కదారి పట్టకుండా లెక్క పక్కా చేశారు. మరిదేంటి? గోడౌన్లలో రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలు ఎక్కడి నుంచి వచ్చి చేరుతున్నాయి? ఇది సామాన్యులకు అంతుబట్టని ప్రశ్నేకానీ, అధికారులకు మాత్రం కాదు. తరచి చూస్తే వ్యవస్థీకృతమైన అవినీతే ఇందులోనూ కనిపిస్తుంది. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఈ-పోస్‌ ద్వారా పారదర్శకత వచ్చిన తర్వాత కూడా అక్రమ బియ్యం నిల్వల గురించి తరచూ వింటున్నాం. ఈ సమస్య దాడులతో పరిష్కారమయ్యేది కాదు. ఈ విషయం అధికారులకూ తెలుసు. సమస్య మూలాలను పట్టించు కోకుండా పైపైన దాడులతో ఎలా నియంత్రిస్తారో అధికారులకే తెలియాలి. రేషన్‌ బియ్యం ఈ-పోస్‌ ద్వారా నిజమైన లబ్ధిదారులకే అందుతోంది. మరి మార్కెట్లోకి ఎలా వస్తున్నాయి? అనేదే అందరి ప్రశ్న. 


 ఈ బియ్యం తినలేక..

రేషన్‌ బియ్యాన్ని ప్రజలు తినలేకపోతున్నారన్నది బలమైన ఆరోపణ. ప్రభుత్వం అందజేస్తున్న చౌక బియ్యాన్ని నూటికి 30 మంది కార్డుదారులు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారని, మిగిలిన 70 మంది కార్డుదారులు ఇతరత్రా అవసరాలకు ఉపయోగిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. మరి కొందరు వీటిని తిరిగి డీలర్లకే విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనంతకాలం.. వ్యవస్థీకృతమైన అవినీతిని సమూలంగా నిర్మూలించలేనంత కాలం ఈ సమస్య ఇలానే ఉంటుంది. 


 అవినీతి ‘సైక్లింగ్‌’ ఇలా!

ఈ-పోస్‌ వచ్చినా చౌక బియ్యం రీ సైక్లింగ్‌ జరుగుతోంది. అది డీలర్ల ద్వారానే. అయితే ప్రత్యక్షంగా కాదు.. కార్డుదారులకే డీలర్లు బియ్యం విక్రయిస్తున్నారు. మళ్లీ ఆ డీలర్లే కార్డుదారుల నుంచి కొంటున్నారు. ఇదంతా ఓ అవినీతి సైకిల్‌. కొవిడ్‌ సీజన్‌లో ఉపాధి కోల్పోయిన వారు, పేద, మధ్య తరగతి ప్రజలు తిండికి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతి నెలా రెండు పర్యాయాలు ఉచితంగా రేషన్‌ ఇస్తున్నాయి. ఏప్రిల్‌ నుంచి ఇస్తున్న ఈ రేషన్‌ బియ్యాన్ని మొదటి రెండు నెలలూ కష్టమైనా తిన్నారు. తరువాత కొందరు ఈ నాసిరకం బియ్యాన్ని తినలేక అమ్ముకోవడం మొదలెట్టారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలా జరుగుతోంది.


కొందరు రేషన్‌ డీలర్లు, ఇంటింటికీ వెళ్లి, కిలో రూ.3కు రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తారు. ఆ బియ్యాన్ని చిల్లర వర్తకులకు రూ.5కు విక్రయిస్తారు. చిల్లర వర్తకులు ట్రేడర్లకు రూ.10కి విక్రయిస్తారు. ట్రేడర్ల నుంచి రైస్‌ మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లు ఈ  బియ్యానికి ఫినిషింగ్‌ పట్టి తమ వద్ద నిల్వ చేస్తారు. ప్రతి  ఏడాదీ జిల్లా యంత్రాంగం రైతుల దగ్గర నుంచి ధాన్యం  కొనుగోలు చేసి వాటిని బియ్యం ఆడించేందుకు రైస్‌ మిల్లర్లకు అందిస్తుంది. కొందరు మిల్లర్లు నాణ్యమైన ఆ ఽధాన్యాన్ని ఆడించి, తమ వద్ద భద్రపరుస్తారు. వీటి స్థానంలో తమ వద్ద ఉన్న చౌక బియ్యం నిల్వలను ఉంచుతున్నారు. ఈ బియ్యం మొత్తాన్నీ పరీక్షించటం అధికారులకు అసాధ్యం. దీంతో మూడొంతుల చౌక బియ్యమే పదేపదే రీ సైక్లింగ్‌ అవుతోంది. అవినీతి అఽధికారులు, ఉద్యోగుల కారణంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడమే ఇందుకు కారణం. క్షేత్రస్థాయిలో ఈ అక్రమాలను అరికట్టాలి. అదే సమయంలో ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్నే పంపిణీ చేయాలి. 

Updated Date - 2020-10-31T08:22:23+05:30 IST