శాశ్వత పరిష్కారంతోనే.. కొల్లేరు కష్టాలకు తెర

ABN , First Publish Date - 2020-10-27T09:54:11+05:30 IST

కొల్లేరు ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపితేనే వారికి మౌలిక వసతులు అందుతాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

శాశ్వత పరిష్కారంతోనే.. కొల్లేరు కష్టాలకు తెర

కైకలూరు: కొల్లేరు ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపితేనే వారికి మౌలిక వసతులు అందుతాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. సోమవారం కైకలూరు మండలం పందిరిపల్లెగూడెం, శృంగవరప్పాడు గ్రామాల్లో వరద బాధితులను లోకేశ్‌ పరామర్శించారు. 15 రోజులుగా కొల్లేరు గ్రామాలన్నీ ముంపులోనే ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందలేదని ప్రజలు లోకేశ్‌ ఎదుట తమ సమస్యలను ఏకరువు పెట్టారు. మత్య్సకారుల నాటుపడవలు, తాటిదోనెలు, ఎదురుమావులు కొల్లేరులో కొట్టుకుపోయాయని, దీంతో ఉపాధిని కోల్పోయి, పస్తులుంటున్నామని వారు కంటతడి పెట్టారు. వరదలకు దెబ్బతిన్న ఇళ్ల వివరాలను అధికారులు ఇంతవరకు సేకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శృంగవరప్పాడు గ్రామంలో ముంపునకు గురైన రోడ్లను పరిశీలించాలని ప్రజలు కోరగా లోకేష్‌ నీటిలో నడుచుకుంటూ వెళ్లి ఆప్రాంత ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కొల్లేరు ప్రజల బాధలు వర్ణనాతీతం అన్నారు.


నిత్యావసరాలు అందజేయడంలో అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడాన్ని తప్పు పట్టారు. రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ముంపు ఎక్కువగా ఉందని, సీఎం జగన్‌ ఒక్కచోట కూడా ప్రజల ఇబ్బందులను, పంట నష్టాలను ప్రత్యక్షంగా చూడలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇప్పటివరకూ ఏవిధమైన సహాయం అందలేదన్నారు. ఈ సమస్యలన్నింటిపై పూర్తి నివేదికను పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేస్తామన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముంపు ప్రాంత ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. పర్యటనలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్‌, జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.


పోలీసుల అత్యుత్సాహం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పెంచికలమర్రు వద్ద కొల్లేరు గ్రామాలను పరిశీలించేందుకు స్థానిక టీడీపీ నాయకులు రెండు పడవలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పడవ సుమారు 25 టన్నుల బరువు మోయగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఒక పడవలో లోకేశ్‌, మాజీ మంత్రులు, పార్టీ నేతలు ఎక్కారు. రెండో పడవలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎక్కారు. పడవ బయలుదేరే సమయంలో సామర్ధ్యానికి మించి ఎక్కారంటూ కైకలూరు రూరల్‌ ఎస్సై టి.రామకృష్ణ అడ్డుచెప్పారు. దీంతో డ్రైవర్‌ పడవను నిలిపివేశాడు. పడవలో ఉన్న సగం మంది దిగితేనే వెళ్ళనిస్తాననడంతో 15మంది దిగేశారు. అయినప్పటికీ పడవ వెళ్ళేందుకు అనుమతించకపోవడంతో 25 టన్నుల సామర్య్ధంకల్గిన పడవలో 100 మంది కూడా లేరని, అభ్యంతరం ఏమిటని ఎస్సైను ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నించారు.


దీంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తేనే బోటును వెళ్లనిస్తానంటూ ఎస్సై సుమారు 30 నిమిషాలకుపైగా బోటును నిలిపివేశారు. వైసీపీ నాయకుల ఆదేశాల మేరకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడడంతో ఎట్టకేలకూ పడవను కదిలించేందుకు ఎస్సై అనుమతించారు.

Updated Date - 2020-10-27T09:54:11+05:30 IST