మహోద్యమమై..

ABN , First Publish Date - 2020-10-13T11:08:33+05:30 IST

అమరావతి సాధన.. అంతిమ లక్ష్యం అదే.. మహోద్యమంలా సాగుతున్న రాజధాని ఉద్యమం 300 రోజులైన సందర్భంగా సోమవారం ఆందోళనలు మిన్నంటాయి. 300 రోజులు కాదు..

మహోద్యమమై..

ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌: అమరావతి సాధన.. అంతిమ లక్ష్యం అదే.. మహోద్యమంలా సాగుతున్న రాజధాని ఉద్యమం 300 రోజులైన సందర్భంగా సోమవారం ఆందోళనలు మిన్నంటాయి. 300 రోజులు కాదు.. మూడు వేల రోజులైనా న్యాయం జరిగే వరకు పోరు బాట నుంచి వెనకడుగు వేసేది లేదని ప్రజలు స్పష్టం చేశారు. రాజధాని గ్రామాలతో పాటు విజయవాడ నగరంలోనూ ‘జై అమరావతి’ నినాదం మారుమోగింది.


ఆకుపచ్చని చీరలు ధరించి మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు అన్ని దీక్షా శిబిరాల్లో అమరావతి జేఏసీ జెండాలను ఆవిష్కరించిన రైతులు, పది గంటలకల్లా తుళ్లూరుకు చేరుకున్నారు. ఉద్యమంలో అమరులైన 92 మంది ఫొటోలతో పాడెలను రూపొందించి, ఆత్మబలిదాన యాత్రను నిర్వహించారు.


 ఆంధ్రుల రాజధాని అమరావతే.. అంటూ రాజధాని గ్రామాల్లో నినాదాలు మిన్నంటాయి. రాజధాని ఉద్యమం 300వ రోజుకు చేరిన సందర్భంగా సోమవారం నిరసన ప్రదర్శనలు, ధర్నాలతో రాజధాని ప్రాంతం హోరెత్తింది. ఏకైక రాజధాని అమరావతే అని ప్రభుత్వం ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజధాని రైతులు, మహిళలు తేల్చి చెప్పారు. ఇన్ని రోజులుగా తాము చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో జేఏసీ జెండాలను ఆవిష్కరించి, తుళ్లూరుకు చేరుకుని నిరసనల్లో పాల్గొన్నారు.


ఉద్యమంలో అమరులైన 92 మంది రైతులు, కూలీలు, మహిళలకు నివాళులర్పించి, వారి ఫొటోలతో కూడిన  92 పాడెలతో తహసీల్దారు కార్యాలయం వరకు ఆత్మబలిదాన యాత్ర నిర్వహించారు. తమను దూషించిన మంత్రుల మాస్కులు పెట్టుకొని ఉరితాళ్లు మెడకు తగిలించుకుని, మందడంలో నిరసన తెలిపారు. గాయకుడు రమణ ఉద్యమపాటలతో రైతుల్లో స్ఫూర్తి నింపారు. రాత్రి ‘అమరావతి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా 29 గ్రామాల రైతులు కాగడాల ప్రదర్శనలు నిర్వహించగా, మహిళలు కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి సేవ్‌ అమరావతి, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. 


 మద్దతు తెలిపిన రాజకీయ పక్షాలు

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు పలికారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు, బాబూరావు, రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, బీజేపీ బహిష్కృతనేత వెలగపూడి రామకృష్ణ, దళిత నేతలు మేళం భాగ్యారావు, పొతుల బాలకొటయ్య, జి.మార్టీన్‌, కంతేటి బ్రహ్మయ్య, చిలక విజయ్‌కుమార్‌, కె.శిరీష, చిలక బసవయ్య, పులిచిన్న, జేఏసీ నేతలు పువ్వాడ సుధాకర్‌, డాక్టర్‌ రాయపాటి శైలజ తదితరులు సంఘీభావం తెలిపారు. 

 

విజయవాడలో ర్యాలీ

విజయవాడ సిటీ : రాజఽధాని రైతుల ఉద్యమం 300 రోజులు అయిన సందర్భంగా వారికి సంఘీభావంగా విజయవాడలో అమరావతి పరిరక్షణ మహిళా జేఏసీ గాంధీనగర్‌లోని తాలూకా కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. ఈ సందర్బంగా  జేఏసీ నేతలు సుంకర పద్మశ్రీ,  గద్దె అనురాధ, అక్కినేని వనజ తదితరులు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా కొనసాగే వరకు రైతుల ఉద్యమానికి బాసటగా నిలుస్తామన్నారు.


రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న మహిళలను, రైతులను అవహేళనగా మాట్లాడటం సరి కాదన్నారు. రైతు నాయకుడు వెలగపూడి గోపాలకృష్ణ, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.దుర్గాభవానీ, జేఏసీ నాయకురాలు చెన్నుపాటి ఉషారాణి, నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-13T11:08:33+05:30 IST