వీడిన మిస్టరీ.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే..

ABN , First Publish Date - 2020-10-07T09:10:16+05:30 IST

విస్సన్నపేట ఎన్‌ఎస్పీ కెనాల్‌ వద్ద జరిగిన ముగ్గురి హత్య కేసు మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే..

వీడిన మిస్టరీ.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే..

హత్యలకు కారణం వివాహేతర సంబంధమే!

ముగ్గురి హత్య కేసును ఛేదించిన పోలీసులు 

హంతకుల్లో భార్య, భర్త, కుమారుడు

 

విస్సన్నపేట(కృష్ణా): విస్సన్నపేట ఎన్‌ఎస్పీ కెనాల్‌ వద్ద జరిగిన ముగ్గురి హత్య కేసు మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, నందిగామ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎనిమిది ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకున్నారు. విస్సన్నపేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి, హత్యలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 


ఆగిరిపల్లి మండలం కొత్తఈదరకు చెందిన పెల్లూరి చిన్నస్వామి (35), అతని భార్య తిరుపతమ్మ (30), వారి కుమార్తె (11) పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన దాసరి వెంకన్న వద్ద పనిచేస్తూ, అతని ఆటోలో పింగాణి సామగ్రిని గ్రామాల్లో తిరిగి విక్రయించి, నెలవారీ వేతనాలు పొందేవారు. మృతులతో పాటు హంతకులు కూడా నూజివీడు రామాయమ్మరావు పేటలో నివాసం ఉంటున్నారు.


ఇద్దరికీ మనస్పర్థలున్నట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆ కోణంలో కేసు విచారణ జరపగా వెంకన్న కుటుంబమే వీరిని హతమార్చినట్టు తేలిందన్నారు. తన ఇంట్లో ఉంటూ మృతుడు చిన్నస్వామి తన భార్య నాగమణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తనకు నమ్మకద్రోహం చేసిన చిన్నస్వామిపై కక్షతోనే ఈ నేరం చేసినట్టు హంతకుడు వెంకన్న పోలీసుల ఎదుట అంగీకరించారు.


హంతకుడు ఆదివారం మృతుడు చిన్నస్వామితో మద్యం తాగించి, ముందుగా అనుకున్న పథకం ప్రకారం భార్య నాగమణి, కుమారుడితో కలిసి నూజివీడు వెళదామంటూ చిన్నస్వామిని, అతని భార్య తిరుపతమ్మ, మైనర్‌ బాలికైన వాళ్ల కుమార్తెను నమ్మించి, రెండు ఆటోల్లో ప్రయాణమయ్యారు. రెడ్డిగూడెం మండలం ముచ్చునపల్లి గ్రామంలోని మామిడి తోట వద్దకు తీసుకువచ్చి, చిన్నస్వామిని కర్ర, ఇనుపరాడ్డుతో కొట్టి చంపాడు. మృతుడి భార్య తిరుపతమ్మ తప్పించుకోవడానికి ప్రయత్నించగా, ఆమెను వెంటాడి కర్రతో కొట్టి చంపి, వాళ్ల కుమార్తె గొంతుకు ఉరి బిగించి హతమార్చాడు.


ఈ హత్యలో వెంకన్న భార్య నాగమణి, కుమారుడైన మైనర్‌ బాలుడు సహకరించినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. అనంతరం మృతదేహాలను ఆటోలో ఎన్‌ఎస్పీ కాల్వ వద్దకు తీసుకువచ్చి, అక్కడే ఆటోలో శవాలను ఉంచి, ఆటోను కాల్వలోనికి తోయడానికి విఫలయత్నం చేశారు. ఆటో కాల్వగట్టుకు తగిలి, పడిపోకుండా ఆగిపోవడంతో, ఆటోలోని శవాలను కాలువలోకి తోసి, ఆటో ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఎస్పీ తెలిపారు. హంతకులను మంగళవారం ఉదయం కొండపర్వ అడ్డరోడ్డు వద్ద అరెస్ట్‌ చేశామని తెలిపారు. హంతకులు వెంకన్న, నాగమణిలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని, నిందితుల్లో ఒకరైన మైనర్‌బాలుడిని జువైనల్‌ కోర్టుకు తరలిస్తామని చెప్పారు. అయితే వెంకన్న భార్య కూడా ఈ హత్యకు సహకరించినందున వివాహేతర సంబంధమే కారణమా? ఇంకేమైనా కారణాలు కూడా ఉన్నాయా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. 


24 గంటల్లోనే హత్యల మిస్టరీని ఛేదించి, నిందితులను పట్టుకున్న తిరువూరు సీఐ ఎం.శేఖరబాబు, మైలవరం సీఐ పి.శ్రీను, ఎస్‌ఐలు లక్ష్మణ్‌, శివనారాయణ, సుబ్రమణ్యం, మహేష్‌ శ్రీనివాస్‌, ప్రతాప్‌ రెడ్డి, ధర్మరాజు, రాంబాబులను ఎస్పీ అభినందించారు. కాగా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని బుడగ జంగాల సంఘాల నాయకులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 

Read more