రూ.3 కోట్ల వ్యయం మూణ్ణాళ్ల ముచ్చటేనా?

ABN , First Publish Date - 2020-09-29T10:14:54+05:30 IST

ఫలితంగా మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారులనిర్మాణం మూణ్ణాళ్లముచ్చటగామారిపోయింది. ఈరోడ్లకథ తెలుసుకోవాలంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లాల్సిందే.

రూ.3 కోట్ల వ్యయం మూణ్ణాళ్ల ముచ్చటేనా?

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/భవానీపురం)

రహదారుల నిర్మాణం అంటే కాంట్రాక్టర్లకు కాసుల పంటే. ఫలితంగా మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారులనిర్మాణం మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఈ రోడ్ల కథ తెలుసుకోవాలంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లాల్సిందే..! విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 43, 42, 41 డివిజన్లలో సుమారు ఆరు నెలల కాలంలో వీఎంసీ జనరల్‌ ఫండ్స్‌తో రూ.3 కోట్ల విలువైన రహదారుల పనులకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ శంకుస్థాపనలు చేశారు.


ఈ పనులన్నీ మంత్రి అనుచరులే చేస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారి గతుకులమయంగా మారడంతో దాన్ని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించారు. సుమారు రూ.50 లక్షల వ్యయంతో సుమారు కిలోమీటరు దూరం ఉన్న ఈ రోడ్డుకు టెండర్లు పిలిచారు. మంత్రిగారి ఆశీస్సులతో చక్రం తిప్పడంతో టెండ‘రింగ్‌’ జరిగి ఆయన అనుచరులే ఆ పనిని దక్కించుకున్నారు. భవానీపురం పోలీసుస్టేషన్‌ రోడ్డు 20 రోజుల క్రితం పూర్తయింది. ఆది, సోమవారాల్లో కొత్తగా వేసిన రోడ్డు పలుచోట్ల కుంగిపోవడం..


గతుకులు తేలడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిని నాణ్యతతో నిర్మించాల్సిన కాంట్రాక్టరు కాసుల కక్కుర్తితో నాసిరకంగా పూర్తిచేయడంతో 20 రోజులకే కుంగిపోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు. 41, 42, 43 డివిజన్లలో నిర్మాణంలో ఉన్న రహదారుల పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. కొత్తగా వేసిన రోడ్డు 20 రోజులకే కుంగిపోవడంతో కాంట్రాక్టర్‌ ఆగమేఘాలపై సోమవారం కుంగిన చోట్ల మెటీరియల్‌ వేసి రోడ్డు రోలర్‌తో సరిచేశారు.

 

మంత్రి వెనుక శిలాఫలాకాల ఆవిష్కరణలో చురుగ్గా పాల్గొనే ఈఈ, డీ ఈ, ఏఈలు రహదారుల నిర్మాణ సమయంలో పర్యవేక్షణ చేయకుండా వదిలేయడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాసిరకం మెటీరియల్‌తో రహదారుల నిర్మాణం పూర్తి చేసేస్తున్నారు.

 

మంత్రి అనుచరులే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తడంతో మనకెందుకులే అని ఇంజనీరింగ్‌ అధికారులు ఎవ్వరూ నాణ్యతను ప్రశ్నించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ హయాంలో కన్నా మా హయంలో అభివృద్ధి జరిగిపోతుందని ఆర్భాటపు ప్రకటనలు చేసే మంత్రి వెలంపల్లి నాసిరకం రోడ్లు నిర్మాణం చేస్తున్న తన అనుచరులైన కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలకు ఆదేశించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-09-29T10:14:54+05:30 IST