రైతు భరోసా కేంద్రాలు కాదు.. బోగస్ కేంద్రాలు!
ABN , First Publish Date - 2020-12-30T06:17:47+05:30 IST
రైతులకు అవసరమైన అన్ని సేవలనూ రైతు భరోసా కేంద్రాల్లో అందిస్తున్నామని చెబుతూ రైతుల్ని మభ్యపెడుతున్నారని, అవి రైతు భరోసా కేంద్రాలు కావని, బోగస్ కేంద్రాలనీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆరోపించారు.

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆరోపణ
మోపిదేవి, డిసెంబరు 29 : రైతులకు అవసరమైన అన్ని సేవలనూ రైతు భరోసా కేంద్రాల్లో అందిస్తున్నామని చెబుతూ రైతుల్ని మభ్యపెడుతున్నారని, అవి రైతు భరోసా కేంద్రాలు కావని, బోగస్ కేంద్రాలనీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన రైతు కోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రమైన మోపిదేవిలో పార్టీ నాయకులు, పలువురు రైతులతో కలిసి పంట నష్టం నమోదు అంచనా వివరాలు తెలుసుకునే నిమిత్తం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 12.20 నిమిషాలకు కేంద్రానికి వెళ్లగా, ఆర్బీకేకు తాళాలు వేసి ఉండటాన్ని గమనించి విస్మయం వ్యక్తం చేశారు. వాణిజ్య, కూరగాయల పంటలు దివిసీమ ప్రాంతంలోని మోపిదేవి మండలంలో అత్యధికంగా రైతులు సాగు చేస్తుంటారని, రెండు దఫాలు వరదలు వచ్చి తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. కౌలు రైతులకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఆర్బీకేకు రాగా సిబ్బంది లేకపోవడం, కనీసం తాళాలు కూడా తీయకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నడకుదుటి జనార్థనరావు, యాసం చిట్టిబాబు సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ సభ్యులు కొల్లూరి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు చందన రంగారావు, గొరిపర్తి శ్రీనివాసరావు, దిడ్ల జానకి రాంబాబు పాల్గొన్నారు.
మోపిదేవి : రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం మూలంగానే దివిసీమలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం మోపిదేవి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.