బీఎస్‌-6 రెడీ!

ABN , First Publish Date - 2020-03-18T09:54:51+05:30 IST

నగరంలోకి భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌) - 6 వాహనాలు ప్రవేశించాయి. మార్చి నెలాఖరు వరకు మాత్రమే బీఎస్‌ - 4 వాహనాలకు రవాణా శాఖ రిజిస్ర్టేషన్‌ చేయనుండటంతో .. షోరూమ్‌లు పోటీలు పడి తగ్గింపు ధరలతో భారీ ఆఫర్లను ఇస్తాయనుకున్న వినియోగదారులకు నిరాశే ఎదురైంది.

బీఎస్‌-6 రెడీ!

ఏప్రిల్‌ 1కు ముందుగానే నగర షోరూమ్‌లలో బీఎస్‌ - 6 వాహనాలు 

మార్చి 31 వరకే బీఎస్‌ - 4 రిజిస్ర్టేషన్‌ 

బాడీ బిల్డింగ్‌ పూర్తయితేనే రవాహణా వాహనాల రిజిస్ట్రేషన్‌


ఆంధ్రజ్యోతి, విజయవాడ: నగరంలోకి భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌) - 6 వాహనాలు ప్రవేశించాయి. మార్చి నెలాఖరు వరకు మాత్రమే బీఎస్‌ - 4 వాహనాలకు రవాణా శాఖ రిజిస్ర్టేషన్‌  చేయనుండటంతో .. షోరూమ్‌లు పోటీలు పడి తగ్గింపు ధరలతో భారీ ఆఫర్లను ఇస్తాయనుకున్న వినియోగదారులకు నిరాశే ఎదురైంది. గడువు దగ్గర పడటంతో బీఎస్‌ - 4 వాహనాలు తక్కువ ధరకు లభిస్తాయేమోనని వాహనదారులు షోరూమ్‌లకు వెళితే సారీ .. అన్నమాట వస్తోంది. ఎందుకంటే షోరూమ్‌లలో ఆ వాహనాలు మచ్చుకు కూడా కనిపించని పరిస్థితి. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థలన్నీ 15రోజుల క్రితమే బీఎస్‌ - 6 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చి సేల్‌ చేయటం ప్రారంభించాయి.


సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో కేంద్ర ప్రభుత్వం మూడు నెలల అవకాశం కల్పించటంతో కంపెనీలన్నీ యుద్ధ ప్రాతిపదికన తమ ప్లాంట్లలో బీఎస్‌ - 6  ఉత్పత్తులను ప్రారంభించాయి. ప్రారంభించిన ఉత్పత్తులను డీలర్లకు  అందుబాటులోకి తీసుకు వచ్చాయి. ఈ సమయంలో.. బీఎస్‌ - 4 వాహనాలను కంపెనీలు కొత్తగా రూపొందించలేదు. దీంతో డైలీ సేల్స్‌లో భాగంగా ఆ వాహనాలు సాధారణంగానే అమ్ముడు పోయాయి. విక్రయించిన బీఎస్‌ - 4 ద్విచక్ర వాహనం స్థానంలో.. బీఎస్‌ - 6 వస్తోంది.  ప్రస్తుతం షోరూమ్‌ల వద్ద పదుల సంఖ్యలోనే బీఎస్‌ - 4 వాహనాలు ఉన్నాయి. ఇవి కూడా టూ టైర్‌ సిటీ బెజవాడలోనే కాస్తో, కూస్తో అందుబాటులో ఉన్నాయి. మండల కేంద్రాల స్థానంలో ఉన్న షోరూమ్‌లలో అయితే ఒకటి , అరా మించి లేవు. బీఎస్‌ - 4 వాహనాలు ఎక్కువగా ఉంటే.. ఏప్రిల్‌ 1 నుంచి ఎలాగూ స్ర్కాప్‌తో సమానమే. వాటిని వదిలించుకోవడానికి కంపెనీలు, డీలర్లు ఆఫర్లను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ ఆవసరం ద్విచక్ర వాహన కంపెనీలు, డీలర్లకు లేదు. దీంతో ఆఫర్లను ప్రకటించలేదు. 


కార్లకు ఇంకా ఉన్నాయి : 

ద్వి చక్రవాహనాలకు ఉన్నంత వేగం కార్లకు  లేదనే చెప్పవచ్చు. కార్ల షోరూమ్‌లకు బీఎస్‌ - 6 వాహనాలు వచ్చినా, ఇంకా బీఎస్‌ - 4 వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ బీఎస్‌ - 4 కార్లు దాదాపుగా స్ర్కాప్‌తో సమానమే. ఎందుకంటే ఏప్రిల్‌ 1 నుంచి రవాణాశాఖ బీఎస్‌ - 4 కార్లకు ఎలాంటి రిజిస్ర్టేషన్‌ చేయదు. కార్లకు అయితే కొన్ని కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయినా వినియోగదారులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆర్థిక పరిస్థితి అంతో, ఇంతో ఉన్నవారే ఎక్కువ భాగం కార్లను కొనగలరు. దీనికి తోడు ప్రతి నెలా కారు నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కార్లు తక్కువగా వస్తున్నాయని ఆర్థిక పరిస్థితి చూసుకోకుండా కొనుగోలు చేసే వారి సంఖ్య పెరగ దు. ట్యాక్సీలుగా తిప్పుకోవటానికి డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ట్యాక్సీల యజమానులకు ఆశాజనక పరిస్థితి లేదు. 


‘రవాణా’ వాహనాలు ముందస్తుగా కొనుగోళ్ళు 

రవాణా వాహనాల విషయంలో కొంత పురోగతి ఉంది. ఇప్పటికే ముందస్తుగా బీఎస్‌ - 4 కేటగిరికి జిల్లాలో 300 రవాణా వాహనాలు కొనుగోలు చేసినట్టు తెలిసింది. వీటిని కొన్న వారు బాడీ బిల్డింగ్‌ చేయించుకోవడంలో జాప్యం చేస్తుండటంతో రవాణా శాఖ కూడా రంగంలోకి దింది. మార్చి 31 నాటికి బాడీ బిల్డింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలని గడువు దాటితే కుదరదని స్పష్టం చేశారు. ట్రక్కులు, బస్సులు, ట్రిప్పర్లు కొనుగోలు చేసిన వారు బాడీ బిల్డింగ్‌కు ఇచ్చారు. 


Updated Date - 2020-03-18T09:54:51+05:30 IST