‘సుద్దులు చెప్పి రద్దు చేస్తారా?’

ABN , First Publish Date - 2020-02-08T16:07:51+05:30 IST

నవరత్నాలతో ప్రజల తలరాతలు మారిపోతాయని ఎన్నికల ముందు..

‘సుద్దులు చెప్పి రద్దు చేస్తారా?’

పాయకాపురం(కృష్ణా): నవరత్నాలతో ప్రజల తలరాతలు మారిపోతాయని ఎన్నికల ముందు ఊదరగొట్టిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్న పింఛన్లు, రేషన్‌కార్డులను రద్దు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ధ్వజమెత్తారు. పింఛన్లు, రేషన్‌ కార్డుల రద్దుపై శుక్రవారం అజిత్‌సింగ్‌నగర్‌ పైపుల రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలను రద్దు చేయడం దారుణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదలు, వితంతు, వృద్ధాప్య పింఛన్లను అంచెలంచెలుగా పెంపుదల చేసిందన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్‌ను రూ.3వేలు చేస్తామని చెప్పి చివరకు రూ.250లు మాత్రమే పెంచారని దుయ్యబట్టారు. విద్యుత్‌ బిల్లులను సాకుగా చూపించి సంక్షేమ పథకాలను రద్దు చేసి, మళ్లీ ఆ పథకాలకు అర్హులుగా ఉండాలంటే తెల్లరేషన్‌ కార్డు తప్పనిసరి అని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ప్రస్తుతం రద్దు చేసిన పింఛన్లు, కార్డులను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే  పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 


అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నూతన విధానాలతో ప్రజలు వణికి పోతున్నారన్నారు. జగన్‌ అభివృద్ధి నిరోధకుడిగా తయారైయ్యారని దుయ్యబట్టారు. 45 ఏళ్లకే పింఛను ఇస్తామని రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచుతామని, ఎన్నికల ప్రచారంలో తప్పుడు హామీలు గుప్పించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌, అర్బన్‌ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు, డిప్యూటీ మే యర్‌ గోగుల రమణ, మాజీ కార్పొరేటర్లు పిరియా జగదాంబ, ఎరబోతు శ్రావణి, పైడి తులసి, నేల బండ్ల బాలస్వామి, దాసరి కనకారావు, పరుచూరి ప్రసాద్‌, శ్రీనివాస్‌, భాను సింగ్‌, సతీష్‌, వైకుంఠం, సుబ్బయ్య యాదవ్‌, జయరాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-08T16:07:51+05:30 IST