బెంజిసర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ టెండర్లు ఖరారు

ABN , First Publish Date - 2020-08-22T08:26:22+05:30 IST

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌-2కు శుక్రవారం టెండర్లు ఖరారయ్యాయి. లక్ష్మీ ఇన్‌ఫ్రా సంస్థ కాంట్రాక్టును దక్కించుకుంది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చేతులమీదుగా త్వరలో

బెంజిసర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ టెండర్లు ఖరారు

ఆంధ్రజ్యోతి, విజయవాడ : బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌-2కు శుక్రవారం టెండర్లు ఖరారయ్యాయి. లక్ష్మీ ఇన్‌ఫ్రా సంస్థ కాంట్రాక్టును దక్కించుకుంది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చేతులమీదుగా త్వరలో శంకుస్థాపన జరగనుంది. రూ.100 కోట్లతో దీనిని నిర్మించనున్నారు. టెండర్లలో ఆరుకుపైగా కాంట్రాక్టు సంస్థలు పాల్గొనగా, పూర్వానుభవం, పనిలో వేగం వంటి అర్హతలతో పాటు ఫైనాన్షియల్‌ బిడ్స్‌లో తక్కువకు కోట్‌ చేయటం వల్ల లక్ష్మీ ఇన్‌ఫ్రాను జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) ఎంపిక చేసింది.


బెంజ్‌-1 ఫ్లై ఓవర్‌ను చేపట్టిన దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ బెంజ్‌-2కు టెండర్‌ వేయలేదు. లక్ష్మీ ఇన్‌ఫ్రా ఇప్పటికే విజయవాడ పరిధిలో ప్రతిష్ఠాత్మక పనులు చేపట్టింది. కాజ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు ప్యాకేజీ-2లో భాగంగా కలపర్రు-చిన అవుటపల్లి వరకు జాతీయ రహదారిపై ఆరు వరసల పనులు చేపడుతోంది.  కంచికచర్ల, జగ్గయ్యపేట దగ్గర బైపాస్‌ పనులను కూడా చేపట్టింది. చిన్న అవుటపల్లి నుంచి కనకదుర్గ వారధి వరకు ఎన్‌హెచ్‌-16 వీఐపీ కారిడార్‌ పనులను కూడా ఇదే సంస్థ దక్కించుకుంది.


సర్వీసు రోడ్డు విస్తరణ లేని అలైన్‌మెంట్‌తో..

బెంజిసర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌కు సంబంధించి సర్వీసు రోడ్డు విస్తరణ అవసరం రాకుండా అలైన్‌మెంట్‌ను అడ్జస్ట్‌ చేసి నిర్మిస్తున్నారు. ఎస్వీఎస్‌ జంక్షన్‌, రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్ల దగ్గర అప్రోచ్‌ల నిడివి కూడా తగ్గుతుంది. మొదటి వరసలో ఎక్కువ భాగం వాల్‌తో అప్రోచ్‌లను నిర్మించారు. దీనివల్ల వ్యాపార సంస్థలకు ఇబ్బందిగా మారింది. సర్వీసు రోడ్డు విస్తరణకు కూడా భూ సేకరణ అవసరమైంది.


భారీ మార్కెట్‌ రేట్స్‌ ఉండటంతో పరిహారం ఇవ్వటానికి కేంద్రం వెనకడుగు వేసింది. ఈ సమస్య ఇప్పటికీ  కోర్టులో నడుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌హెచ్‌ అధికారులు అలైన్‌మెంట్‌పై దృష్టిపెట్టారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా, సర్వీసు రోడ్డు విస్తరణ అవసరం రాకుండా, వ్యాపార సంస్థలకు అనుకూలంగా ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తారు. 

Updated Date - 2020-08-22T08:26:22+05:30 IST