పోర్టు ‘రైట్‌!’

ABN , First Publish Date - 2020-11-06T15:58:10+05:30 IST

జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరనుంది..

పోర్టు ‘రైట్‌!’

బందరుపోర్టు నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం

రూ.5,834.51కోట్లతో తొలివిడత పోర్టు పనులు

రైట్స్‌ సంస్థ డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర

టెండర్లు పూర్తయితేనే పనులు వేగవంతం

మచిలీపట్నంలో వైద్యకళాశాలకు 29.6 ఎకరాలు


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం: జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరనుంది. బందరు పోర్టు నిర్మాణానికి ఎట్టకేలకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. రైట్స్‌ సంస్థ ఇటీవలే తన డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిని పరిశీలించి, రూ.5,834.51 కోట్లతో తొలివిడత పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 


బందరు పోర్టు నిర్మాణానికి ఎట్టకేలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైసీపీ అధికారం చేపట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్‌తో బందరుపోర్టు నిర్మాణం కోసం భూసార పరీక్షలు చేయించడంతో పాటు, డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను తయారు చేయించిన విషయం తెలిసిందే. రైట్స్‌ సంస్థ డీపీఆర్‌ను ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీంతో ఇక నుంచయినా పోర్టు పనులు పరుగులు పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 36 నెలల వ్యవధిలో బందరుపోర్టు తొలివిడత పనులు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 


ప్రభుత్వం ద్వారానే పోర్టు నిర్వహణ 

సుమారు 20 సంవత్సరాలుగా బందరుపోర్టు కోసం ఉద్యమం  సాగుతూ వస్తోంది.  2007వ  సంవత్సరంలో  పోర్టు నిర్మాణానికి అనుమతులు లభించాయి. అయినా వివిధ కారణాలతో పోర్టు పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతూ వస్తోంది. తొలుత మేటాస్‌ సంస్థకు, అనంతరం నవయుగ సంస్థకు పనులు అప్పగించారు. ప్రైవేటు కంపెనీలు పోర్టు నిర్మాణం చేసుకుని బీవోటీ పద్ధతిలో పోర్టును నడిపేలా గతంలో కాంట్రాక్టును ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన  నాలుగునెలల వ్యవధిలో నవయుగ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసింది.. ప్రభుత్వమే పోర్టు నిర్మాణం చేపట్టి, ఆదాయం సమకూర్చుకుంటుం దని పాలకులు చెబుతూ వచ్చారు.  రైట్స్‌  ఇచ్చిన నివేదిక ఆధారంగా రూ.5,834.51కోట్లతో పోర్టును నిర్మించాలని నిర్ణయించడం శుభపరిణామం. 


ప్రైవేటు కంపెనీ ద్వారానే పనులు 

బందరుపోర్టును ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా, నిర్మాణ పనులు ప్రైవేటు కంపెనీ ద్వారానే  చేయిస్తామని పాలకులు చెబుతున్నారు. అయితే పోర్టు నిర్మాణ పనులకు టెండర్లు ఎప్పటిలోగా పిలుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. టె ండర్ల ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టును అప్పగించిన నాటి నుంచి 36 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆదానీగ్రూపు లేదా, మేఘా సంస్థకు పోర్టు పనులు అప్పగిస్తారనే ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకుంది. మేఘా సంస్థ ఎండీ జిల్లాకు చెందిన వ్యక్తే కావడంతో ప్రాంతీయ అభిమానంతోనైనా పోర్టు పనులను వేగవంతంగా పూర్తిచేస్తారనే ప్రచారమూ ఇటీవల కాలంలో ఊపందుకుంది. మేఘా సంస్థకే పోర్టు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. పోర్టునిర్మాణం 5,324 ఎకరాల్లో చేయాలని  గతంలోనే నిర్ణయించారు. తొలివిడత 2,200 ఎకరాల్లో ఆరు బెర్తులతో నిర్మాణం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ భూమిని 2017లోనే సేకరించి కాకినాడ పోర్టు డైరెక్టరుకు అప్పగించారు. భూసేకరణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేనందున పోర్టు పనుల ప్రారంభానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా, ఇతరత్రా కారణాలతో ఆర్థిక వనరులను ప్రభుత్వం ఎంతమేరకు సమకూరుస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కేబినెట్‌ నిర్ణయంతో సరిపెట్టకుండా ఈసారైనా పోర్టు పనులను చేపట్టి, వేగంగా పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 


వైద్యకళాశాలకు 29.6 ఎకరాలు

మచిలీపట్నంలో వైద్యకళాశాల ఏర్పాటు నిమిత్తం 29.6 ఎకరాలను కేటాయిస్తూ  రాష్ట్ర  కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం రాడార్‌ కేంద్రం సమీపంలో వ్యవసాయ పరిశోధనా క్షేత్ర భూమిని ఇందుకు కేటాయించారు. రూ.550 కోట్లతో వైద్య కళాశాలను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.


పోర్టు నిర్మాణం ఇలా..

రైట్స్‌ సంస్థ డీపీఆర్‌ ప్రకారం సముద్రంలో 2.31 కిలోమీటర్ల దూరంలో ఆరు బెర్తులను నిర్మిస్తారు. బొగ్గు దిగుమతికోసం ఒకబెర్తు, రెండు కంటెయినర్‌ బెర్తులు, నాలుగు జనరల్‌ కార్గో బెర్తులను నిర్మిస్తారు. ఒక్కో బెర్తు 34 మీటర్ల వెడల్పు, 300 మీటర్ల పొడవు ఉంటుంది. 80 వేల టన్నుల సామర్ధ్యం ఉన్న ఓడలు వచ్చి ఆగేలా బెర్తుల నిర్మాణం జరుగుతుంది.  బెర్తుల వద్దకు ఓడలు వచ్చి ఆగేందుకు 12.7 కిలోమీటర్లు వెడల్పున ప్రత్యేక కాలువను తవ్వుతారు. ఓడల రాకపోకలకు అంతరాయంలేకుండా దీని లోతు 16.80 మీటర్లు ఉంటుంది. సరుకులు ఎగుమతులు, దిగుమతులు చేసేందుకు  గిడ్డంగులను నిర్మిస్తారు. స్టాక్‌ యార్డులు, రోడ్డు, రైలు మార్గాలను పరిపాలనా భవనాలను నిర్మిస్తారు. తాగునీటి వసతులను కల్పిస్తారు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, సెక్యూరిటీ భవనాలు నిర్మిస్తారు. డంపింగ్‌ యార్డులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు  తీసుకుంటారు.  800 ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల్లో పోర్టుకు అవసరమైన అన్ని నిర్మాణాలు చేపడతారు.

Updated Date - 2020-11-06T15:58:10+05:30 IST