నో సెలబ్రేషన్స్‌

ABN , First Publish Date - 2020-12-30T06:24:48+05:30 IST

విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కొత్త సంవత్సర వేడుకలను బహిరంగంగా నిర్వహించుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

నో సెలబ్రేషన్స్‌

కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి లేదు

ముఖ్య కూడళ్లలో పటిష్ట బందోబస్తు

రాత్రి పది గంటలకే వాణిజ్యం బంద్‌

బార్‌లు, హోటళ్లు మామూలు సమయానికే మూత

పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు


విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కొత్త సంవత్సర వేడుకలను బహిరంగంగా నిర్వహించుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కొవిడ్‌ రెండో దశ, కొత్త స్ట్రెయిన్‌ కేసుల దృష్ట్యా ఈవెంట్ల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం లేదని వెల్లడించారు. దీనికి సంబంఽధించి మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేశారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్ల వద్దే కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. ఎంజీ రోడ్డులో జనాలు గూమిగూడడం, రహదారులపై కేక్‌ కటింగ్‌లు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషిద్ధమన్నారు. వ్యాపార సంస్థలు రాత్రి పది గంటలకు మూసివేయాలని ఆదేశించారు. హోటళ్లు, బార్‌లు, మద్యం దుకాణాలు ప్రస్తుతం ఉన్న సమయాల్లోనే పనిచేయాలని, వాటికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేవని స్పష్టం చేశారు. మద్యం దుకాణాలు రాత్రి ఎనిమిది గంటల వరకు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే పనిచేయాలని సూచించారు. 21ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయించవద్దని ఆదేశించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో రహస్యంగా పార్టీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాల్లోనూ కొవిడ్‌ నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-12-30T06:24:48+05:30 IST