-
-
Home » Andhra Pradesh » Krishna » Baburao Pressmeet
-
పట్టణ ప్రజలపై పన్నుల మోత!
ABN , First Publish Date - 2020-11-25T06:43:43+05:30 IST
పట్టణ ప్రజలపై పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేయటం సరికాదని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ చిగురుపాటి బాబూరావు విమర్శించారు.

విజయవాడ (పాయకాపురం), నవంబరు 24: పట్టణ ప్రజలపై పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేయటం సరికాదని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ చిగురుపాటి బాబూరావు విమర్శించారు. మంగళవారం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ఈ ఆర్డినెన్స్‌లతో పట్టణ ప్రజలపై వందల రెట్లు పన్నుల భారం పెరుగుతుందన్నారు. మంచినీటి పన్నులు, డ్రెయినేజీ చార్జీలు వసూలుకు ఉత్తర్వులు ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ప్రజలపై భారం మోపడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ఆత్మనిర్బర్ పేరుతో అప్పులు ఎరచూపి షరతులు విధించారన్నారు. అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మార్చేసి రెసిడెన్షియల్ భవనాల మీద 1 నుంచి 5 శాతం వరకు, నాన్ రెసిడెన్షియల్ భవనాల మీద 2 నుంచి మరో 2శాతం వరకూ పెంచుకునే అవకాశం కల్పించారన్నారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వ పన్నుల డిమాండ్ రూ. 10 వేలకోట్ల వరకు పెరగవచ్చని వివరించారు. అలాగే ఆస్తి విలువలను ప్రతి ఏడాదీ సవరిస్తారని, దానికి అనుగుణంగా పన్నులు పెరుగుతాయన్నారు. ఇప్పటి వరకు చెత్త పన్ను, యూజర్ చార్జీలకు చట్టంలో అవకాశం లేదని, ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా పెట్టేశారన్నారు. మోదీ ఆదేశాలతోనే పేదలపై భారాలు వేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మంచినీటి చార్జీలు నెలకు రూ. 100 నుంచి రూ. 300 వరకు పెరగవచ్చని, మీటరు లేని వారికి నెలకు రూ.350 బిల్లు వస్తుందని, ఉన్నవారికి వేరే, స్లాబ్‌లు పెట్టారన్నారు. అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌస్‌లకు వెయ్యి మీటర్లు పెట్టిన వాటికి రూ. 30 నుంచి రూ. 50, కమర్షియల్ భవనాలకు రూ. 60 నుంచి రూ. 170, పరిశ్రమలకు రూ. 40 నుంచి రూ. 80 వరకు భారం పడుతుందన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీకి 375 చదరపు అడుగుల నుంచి ఇంటికి రూ. 60 నుంచి రూ. 80 వరకు వసూలు చేస్తారని, ఏడాదికి రూ. 960 అవుతుందన్నారు. ఇవి ఒక క్లోజెట్‌కని, అదనంగా ఉన్న వాటికి మరో రూ. 10 వేస్తారని చెప్పారు. కమర్షియల్ భవనాలకు రూ. 150 నుంచి రూ. 250 వరకు పెంచుతారని, అదనపు క్లోజెట్‌కు రూ. 25 వసూల్ చేస్తారని బాబురావు అన్నారు. పరిశ్రమలకు పదిసీట్ల వరకు ఉన్న వాటికి రూ. 300 నుంచి రూ. 600 వరకు పెంచుతారని, అదనపు సీటుకు రూ. 15 వసూల్ చేస్తారని వివరించారు. ఇవి కాకుండా డొనేషన్లు వేలల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్థానిక సంస్థల నిర్వహణ ఖర్చు ఎంతైనా, అంతకు ఆదాయం చేరుకునేలా చూడాలని చెబుతున్నారని, ఒక వేళ చేరుకోకపోతే ఇంకా 15 శాతం వరకు పెంచుకునే అవకాశం కల్పించారన్నారు. ఆయా స్థానిక సంస్థలు చేసిన అప్పులకు చెల్లించే వాయిదాలకు అవసరమయ్యే మెత్తాన్ని కూడా ఇందులో నుంచే వసూలు చేయాలని నిర్ణయించారన్నారు. ఆదాయానికి, ఖర్చుకు మధ్య ఎంత తేడా ఉంటే అంత సర్దుబాటు చేసుకునేలా చేయటం సరైనది కాదన్నారు. స్థానిక పాలకమండళ్లు, లేకుండా పన్నులు పెంచే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని వివరించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లోను అమృత పథకం కింద యూజీడీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారని, అది అమలయితే అన్ని ప్రాంతాల్లోనూ భారం పడుతుందని బాబూరావు వివరించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో లో జీవో నెం 116 ద్వారా ఆస్తి పన్ను తగ్గించారని తెలిపారు.