బలవంతంగా లాక్కుంటే సహించం: ఎమ్మెల్సీ అర్జునుడు

ABN , First Publish Date - 2020-03-02T09:54:50+05:30 IST

పేదల ఆధీనంలో ఉన్న అసైన్డ్‌ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే సహించేది లేదని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు.

బలవంతంగా లాక్కుంటే సహించం: ఎమ్మెల్సీ అర్జునుడు

మచిలీపట్నం టౌన్‌: పేదల ఆధీనంలో ఉన్న అసైన్డ్‌ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే సహించేది లేదని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా పేదల అధీనంలో ఉన్న అసైన్డు భూములను ఇళ్ల స్థలాల కోసం వైసీపీ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పది లక్షల పక్కా ఇళ్లు కట్టి పేదలకు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. జీ+3, గృహ నిర్మాణదారుల బకాయిలు రద్దు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఓట్లు వేయించుకున్నారన్నారు. ఇప్పుడు మాట నిలుపు కోకుండా ఓటర్లను మోసం చేశారన్నారు. 


టీడీపీ సానుభూతిపరుల గుడిసెలు పీకేస్తున్నారు

పేదల ఇళ్లు పీకేసి పందిళ్లు వేసినట్టుగా సీఎం పాలన ఉందని ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. టీడీపీ సానుభూతిపరుల గుడిసెలు, రేకుల షెడ్లు పీకేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో పట్టా భూములు కొని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అసైన్డ్‌ భూములు లాక్కుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోందని ఆయన విమర్శించారు. దళితుల సాగు భూములను దౌర్జన్యంగా తీసుకుంటున్నారన్నారు. స్థలాల సేకరణలో వైసీపీ నాయకుల భూములను భద్రంగా ఉంచి టీడీపీ నాయకుల భూములను బెదిరించి లాక్కుంటున్నారన్నారు. చంద్రబాబుపై కోడిగుడ్లు, రౌడీషీటర్లతో దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పీవీ ఫణికుమార్‌, గంజాల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T09:54:50+05:30 IST