-
-
Home » Andhra Pradesh » Krishna » Ashaka Masots on Indrakeeladri
-
సారె సమర్పయామి
ABN , First Publish Date - 2020-06-23T09:17:51+05:30 IST
ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చేనెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి.

విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చేనెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ నెల రోజులు భక్తులు కనకదుర్గమ్మకు సారె సమర్పిస్తారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం 8.30 గంటలకు దుర్గగుడికి వచ్చి అమ్మవారికి తొలిసారెను సమర్పించారు. ఈవో సురేష్‌బాబు, పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు తదితరులు మంత్రి వెంట పాల్గొన్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు, అర్చకులు మేళతాళాల నడుమ ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. ఏటా ఆషాఢ అమావాస్య రోజు నుంచి నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అమ్మవారికి సారె సమర్పించదలచుకున్న భక్తులను రోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. అది కూడా భక్త బృందాలుగా కాకుండా విడివిడిగా భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్కులు ధరించి, శానిటైజర్లు వినియోగిస్తూ క్యూలైన్‌లో అమ్మవారిని దర్శనం చేసుకుని సారె సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో టైం స్లాట్ ప్రకారం దర్శనం టికెట్లు తీసుకుని వచ్చి అమ్మవారికి సారె, ముడుపులు సమర్పించవచ్చని ఈవో సురేష్‌బాబు తెలిపారు. కాగా, అమ్మవారి అంతరాలయంలో ఖడ్గమాలార్చనలో పాల్గొనేందుకు నలుగురికి, శ్రీచక్రనవావర్ణార్చన సేవలో పాల్గొనేందుకు ఐదు జంటలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం నిలిపివేసిన దర్శనాలకు సోమవారం ఉదయం నుంచి అనుమతించారు.