-
-
Home » Andhra Pradesh » Krishna » Armored arrangements for Tenth exams
-
టెన్త్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
ABN , First Publish Date - 2020-03-24T09:59:38+05:30 IST
జిల్లాలో ఈనెల 31 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో ఎం.వి.రాజ్యలక్ష్మి తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
విద్యార్థులు చేతులు కడుక్కునేందుకు సబ్బులు, నీళ్లు ఏర్పాటు
బెంచీకి ఇద్దరే
14 ఫ్లయింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటు
కాపీలు జరిగితే ఇన్విజిలేటర్లకు జైలు
డీఈవో రాజ్యలక్ష్మి వెల్లడి
మచిలీపట్నం టౌన్, మార్చి 23: జిల్లాలో ఈనెల 31 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో ఎం.వి.రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం డీఈవో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, ప్రభుత్వం టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల వద్ద చేతులు కడుక్కునేందుకు సబ్బులు, నీళ్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులను దూరంగా కూర్చోబెడుతున్నామని, బెంచీకి ఇద్దరి కంటే ఎక్కువ సిట్టింగ్ ఇవ్వలేదన్నారు. ఇలా సోషల్ డిస్టెన్స్ అమలు చేస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వచ్చిన వెంటనే తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలన్నారు. జిల్లాలో 279 పరీక్షా కేంద్రాల్లో 57,652 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు.
ఈ పరీక్షలకు 279 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 279 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 12 మంది అడిషనల్ డిపార్ట్‌మెంటల్ అధికారులు, 22 మంది రూట్ ఆఫీసర్లు, 22 మంది అడిషనల్ రూట్ ఆఫీసర్లను, 62 మంది కస్టోడియన్లను, 3,150 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. 14 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కొక్క ఫ్లయింగ్ స్క్వాడ్‌లో ఒక విద్యాశాఖ, ఒక పోలీసు శాఖ, ఒక రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారన్నారు.
సెక్షన్ 25 అమలు
ఈ ఏడాది టెన్త్ పరీక్షల్లో ఖచ్చితంగా సెక్షన్ 25 అమలు చేస్తున్నామని, ఎక్కడైనా కాపీలు జరిపితే ఇన్విజిలేటర్లను జైలుకు పంపే పరిస్థితులు ఉన్నాయన్నారు. గతంలో ఎక్కడైనా కాపీలు జరిపితే ఇన్విజిలేటర్లను తొలగించి వేరే వారిని నియమించేవారమని, ఈ ఏడాది కాపీలు జరిగిన రూముల్లో ఇన్విజిలేటర్లను జైలుకు పంపే పరిస్థితి ఉందన్నారు. కొందరు ఇన్విజిలేటర్లు మెడికల్ లీవుకు దరఖాస్తు చేశారని, ఇలాంటి సెలవులు ఇవ్వడం కుదరదన్నారు. అనారోగ్యంగా ఉండే టీచర్ల దరఖాస్తులను మెడికల్ బోర్డుకు రిఫర్ చేస్తామన్నారు. జిల్లాలో 130 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 70 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు.
ఆ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంచుతున్నామన్నారు. గుడివాడ మాంటిస్సోరి, జగ్గయ్యపేట జిల్లా పరిషత్ హైస్కూల్, బంటుమిల్లి ప్రభుత్వ బాలుర హైస్కూల్, గంపలగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ కేంద్రాలను అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని, జిల్లాలో ఈ తరహా ఏర్పాట్లు చేయడం ఇదే మొదటిసారి అన్నారు.
విద్యార్థులకు బుక్‌లెట్‌లు
పరీక్షా విధానంలో మార్పులు వచ్చాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు మాటి మాటికి అడిషనల్ షీట్లు ఇవ్వకుండా 24 పేజీల బుక్‌లెట్ ఇస్తున్నామన్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. మారిన ప్రశ్నాపత్రంపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్లు ఉండేలా పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.
ర్యాంకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు
జిల్లాలో ఈ ఏడాది టెన్త్ పరీక్షల ర్యాంకులు, పర్సంటేజీలపై ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. చదువుకున్న విద్యార్థికి న్యాయం జరిగేలా పరీక్షలు నిర్వహించేందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ఎక్కడా కాపీయింగ్ జరగకుండా కఠిన చర్యలు చేపట్టామన్నారు. ఒక ప్రశ్నకు సమాధానంగా డీఈవో గతంలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు వచ్చిందని, ఈ ర్యాంకు పెరగాలని కోరుకోవడం లేదన్నారు.