ఆర్టీసీ కార్మికులకు కొత్త కష్టం.. రుణాలను పొందలేక..!

ABN , First Publish Date - 2020-06-22T17:01:52+05:30 IST

ప్రజా రవాణా సంస్థ (పీటీడీ)లోకి విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులు కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌) రుణాలను అందుకోలేక ఆవేదన చెందుతున్నారు. విలీనం కాకముందు సీసీఎస్‌ నిధులు రూ.260 కోట్లను

ఆర్టీసీ కార్మికులకు కొత్త కష్టం.. రుణాలను పొందలేక..!

మంచి త‘రుణం’.. మించిపోతున్నా రాదు..!

కరోనా కాలంలో ఆర్టీసీ కార్మికులకు అందని రుణాలు

సీసీఎస్ నిధులు వాడేసుకున్న యాజమాన్యం

లాక్ డౌన్ కాలంలో రుణాలు కావాలంటున్న కార్మికులు

విజయవాడ జోన్ పరిధిలో 800 దరఖాస్తులు పెండింగ్

లబోదిబోమంటున్న దరఖాస్తుదారులు


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ప్రజా రవాణా  సంస్థ (పీటీడీ)లోకి విలీనమైన ఆర్టీసీ ఉద్యోగులు కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌) రుణాలను అందుకోలేక ఆవేదన చెందుతున్నారు. విలీనం కాకముందు సీసీఎస్‌ నిధులు రూ.260 కోట్లను ఆర్టీసీ యాజమాన్యం సొంత అవసరాలకు ఉపయోగించుకోవటం, విలీనం తర్వాత ఈ నిధులను సీసీఎస్‌కు జమ చేయకపోవటంతో వందలాది మంది కార్మికులు కరోనా సీజన్‌లో అత్యవసర రుణాలను అందుకోలేని పరిస్థితి ఏర్పడింది. విజయవాడ జోన్‌ పరిధిలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి రీజియన్లలో 800 మందికి పైగా ఉద్యోగులు రుణాలు అందుకోలేకపోతున్నారు.


ఆర్టీసీ నిధులను తిరిగి సీసీఎస్‌కు జమ చేయకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3వేల పైచిలుకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే, విజయవాడ జోన్‌ పరిధిలో 800 అపరిష్కృతంగా ఉన్నాయి. అత్యధికంగా కృష్ణా రీజియన్‌లోనే 300 మంది ఉద్యోగులు సీసీఎస్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 


ఎదురుచూపులు

లాక్‌డౌన్‌ సమయంలో ఆర్టీసీలో పనిచేసే పీటీడీ ఉద్యోగులు మొదట్లో సగం జీతం అందుకోవటం, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా సీసీఎస్‌ రుణాల కోసం  ఎదురుచూశారు. సీసీఎస్‌లో నిధులు లేవని, ఆ సంస్థ దివాళా అంచున ఉందన్న ప్రచారం ఉద్యోగులను మానసికంగా కుంగదీసింది. దీంతో రుణాలు రావని తెలిసిన ఉద్యోగులు పీఎఫ్‌ నుంచి కొవిడ్‌ పాండమిక్‌ విత్‌డ్రాయల్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆర్టీసీ సీసీఎస్‌ అనేది అప్పట్లో కార్మికులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న సంస్థ. ఆసియాలోనే అతిపెద్దది. ఆర్టీసీలో దాదాపుగా 50వేల మంది ఉద్యోగులు ఇందులో సభ్యులు. ఏటా ఆర్టీసీ కార్మికులకు అర్హతల ప్రకారం రూ.20 లక్షల మేర గృహ రుణాలు, రూ.5 లక్షల మేర పర్సనల్‌ రుణాలు, రూ.2 లక్షల ఎడ్యుకేషనల్‌ రుణాలు ఇస్తారు. ఈ సీసీఎస్‌కు ప్రస్తుతం గుర్తింపు సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) పాలకవర్గంగా ఉంది. వాస్తవానికి కొవిడ్‌ పాండమిక్‌ రుణాలు ఇచ్చే ఆలోచనలో కూడా పాలకవర్గం ఉన్నా ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్న డబ్బును తిరిగి చెల్లించకపోవటంతో కార్మికుల దరఖాస్తులను పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. రుణాలు వస్తాయన్న ఆశతో అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేసినవారు వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ భారాన్ని ఉద్యోగులు భరించలేకపోతున్నారు. సీసీఎస్‌ దివాళా తీసిందన్న ప్రచారం జరగటంతో పాలకవర్గం భేటీ అయింది. ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్న డబ్బును తిరిగి చెల్లించాలని కోరింది.


సీసీఎస్‌ దివాళా తీస్తుందన్న భయం వద్దు : ఈయూ

సీసీఎస్‌ దివాళా తీస్తుందన్న ప్రచారంపై డిపాజిటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) ప్రకటిం చింది. ఈయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పి.దామోదరరావు ఆదివారం ఒక ప్రకటన చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 3వేల మంది రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వీటిని ఆమోదించటం జరిగిందన్నారు. రుణ చెల్లింపులకు రూ.100 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని, ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్న రూ. 260 కోట్లను తిరిగి చెల్లించకపోవటం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు. తక్షణం ఆర్టీసీ యాజ మాన్యం డబ్బును చెల్లించి ఉద్యోగులకు రుణాలు అందటానికి సహకరించాలని కోరారు.

Updated Date - 2020-06-22T17:01:52+05:30 IST