కొత్త ‘రైస్ కార్డులు’ ఉన్న వాళ్లకే రేషన్.. ఏపీ సర్కారు నిర్ణయంతో పేదల్లో ఆందోళన

ABN , First Publish Date - 2020-03-28T18:11:24+05:30 IST

పేదలకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేసే విషయంలో సివిల్‌ సప్లయిస్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో పాత తెల్ల రేషన్‌కార్డు కాకుండా నూతన రైస్‌కార్డుల ప్రకారం నిత్యావసరాలు అందించాలని

కొత్త ‘రైస్ కార్డులు’ ఉన్న వాళ్లకే రేషన్.. ఏపీ సర్కారు నిర్ణయంతో పేదల్లో ఆందోళన

ఉచిత నిత్యావసరాలు రైస్‌కార్డులు ఉన్నవారికేనట..!

కొత్తకార్డులు ఇవ్వకుండానే ఇదేం లొల్లి..?

ఆందోళనలో కార్డుదారులు

నేడు డిపోల్లో అర్హులైన నూతన రైస్‌ కార్డుదారుల జాబితాలు 

రేపటి నుంచి ఉచిత నిత్యావసరాల పంపిణీ


ఆంధ్రజ్యోతి, విజయవాడ : పేదలకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేసే విషయంలో సివిల్‌ సప్లయిస్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో పాత తెల్ల రేషన్‌కార్డు కాకుండా నూతన రైస్‌కార్డుల ప్రకారం నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పేదల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఇంతవరకు చాలాచోట్ల కొత్త కార్డులు ఇవ్వనేలేదు. పైగా ప్రస్తుతం తెల్లకార్డులు కలిగి రైస్‌కార్డులకు అనర్హులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. వీరంతా డిపోలకు వస్తారు. తాము అర్హులం కాదని తెలిస్తే వివాదాలు రేగే పరిస్థితి ఏర్పడుతుంది. 


విడ్డూరంగా అధికారుల చర్యలు

ప్రతి రేషన్‌ డిపోలో ఉచిత నిత్యావసరాలు ఇవ్వటానికి వీలుగా వీఆర్వో, వీఆర్‌ఏ, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతో మ్యాపింగ్‌ చేశారు. నిత్యావసరాలు తీసుకునేవారు ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో వీరి దగ్గర ఉన్న డేటాను శనివారం ఆయా డిపోల్లో ఉంచుతారట. ఈ జాబితాలను పరిశీలించుకుని అర్హులైన వారు మాత్రం ఈనెల 29వ తేదీ నుంచి వచ్చి ఉచిత నిత్యావసరాలు బియ్యం, కందిపప్పు తీసుకోవాలట. ఇలా చేయడం వల్ల డిపోల దగ్గర వివాదాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాగా, కరోనా కారణంగా విధిగా డీలర్లు రేషన్‌ పోర్టబిలిటీని అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశించారు. 


చౌక డిపోల దగ్గర సామాజిక దూరం 

చౌక డిపోల దగ్గర సామాజిక దూరం పాటించేలా సర్కిళ్లు గీయనున్నారు. మూడు అడుగుల దూరంలో ఒక సర్కిల్‌ గీస్తారు. గ్రామ సచివాలయ అధికారుల్లో ఒకరు బాధ్యులుగా ఉంటారు. నిత్యావసరాలు తీసుకునేవారు ఎవరూ వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు. వేలిముద్ర బాధ్యుడైన సచివాలయ ఉద్యోగి వేస్తాడు. డిపోలకు వచ్చే కార్డుదారులు చేతులు కడుక్కోవటానికి శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు.

Updated Date - 2020-03-28T18:11:24+05:30 IST