పౌరహక్కులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఏపీ డీజీపీ

ABN , First Publish Date - 2020-12-10T19:10:25+05:30 IST

పౌరహక్కుల రక్షణ బాధ్యత తీసుకుంటామని, పౌరహక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతం సవాంత్ హెచ్చరించారు.

పౌరహక్కులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఏపీ డీజీపీ

విజయవాడ: పౌరహక్కుల రక్షణ బాధ్యత తీసుకుంటామని, పౌరహక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లతో మంగళగిరి కార్యాలయం నుంచి డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, వృద్ధులు, అట్టడుగు వర్గాల రక్షణపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు.  ప్రభుత్వ ఆదేశాలతో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు.  పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తామన్నారు. మానవహక్కుల రక్షణను గురుతర బాధ్యతగా తీసుకొంటామని అన్నారు.  పోలీసుల వైపు నుంచి మానవహక్కుల ఉల్లంఘన జరగకుండా దృష్టి సారిస్తామన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మానవ అక్రమ రవాణా వంటి సామాజిక రుగ్మతలకు అడ్డుకట్ట వేస్తామని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-10T19:10:25+05:30 IST