‘సువర్ణావకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్న జగన్ ప్రభుత్వం’

ABN , First Publish Date - 2020-12-17T17:37:07+05:30 IST

ఐదేళ్ల క్రితం అమరావతి నిర్మాణం కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం..

‘సువర్ణావకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్న జగన్ ప్రభుత్వం’

వేల ఎకరాలు వృథా..!

అయినా మూడు రాజధానులకే మొగ్గట 

రాజధానికి అప్పట్లో 34,000 ఎకరాలిచ్చిన రైతులు

చేతిలో బ్రహ్మాండమైన ల్యాండ్‌ బ్యాంక్‌ 

వనరులూ అమర్చిపెట్టిన గత సర్కారు


(అమరావతి, ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల క్రితం అమరావతి నిర్మాణం కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున భూసేకరణ చేపట్టి, రాజధాని గ్రామాల్లోని వేలాదిమంది అన్నదాతల చేయూతగా ప్రక్రియను పూర్తి చేయడం చిన్న విషయమైతే కాదు. రాజధానిలోని 29 గ్రామాల రైతన్నలు ఒకరొకరుగా, ఆ తర్వాత ఉప్పెన మాదిరిగా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఒకటీ రెండూ కాదు. 34,000 ఎకరాలను వీరి నుంచి సేకరించారు. పవిత్ర కృష్ణానది పక్కన, విజయవాడ- గుంటూరు నగరాల మధ్యన, ఏడాది పొడవునా మూడు పంటలు పండే, మొత్తం దాదాపు 120రకాల పంటలు సాగయ్యే బంగరు నేలలివి.


ప్రభుత్వం అప్పట్లో ప్రకటించిన విధంగా తామిచ్చిన భూముల్లో రాజధాని నిర్మిస్తే అది రాష్ట్రం మొత్తానికీ తరగని పెన్నిధిగా నిలుస్తుందని ఆలోచించారు. దానిని ఆలంబనగా చేసుకుని, యావత్తు ప్రపంచమూ ఆశ్చర్యపోయే మహా నగరాన్ని సృష్టించాలని గత ప్రభుత్వం కలలు కన్నది. ఈ దిశగా పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసి, చాలావరకు ఆ కలను అందుకోగలిగింది. ఈ క్రమంలో మిగిలిపోయిన పనులను పరిపూర్తిచేసి నవ్యాంధ్ర రాజధానిని ఆంధ్రులకు అంకితం చేసే సువర్ణావకాశం జగన్‌ ప్రభుత్వానికి లభించింది. కానీ, ఆ అవకాశాన్ని ప్రభుత్వం చేజేతులా పోగొట్టుకుంటోందని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాను పట్టిన కుందేలుకు ‘మూడే కాళ్ల’న్న సామెత చందంగా, మూడు రాజధానుల పాటను ప్రభుత్వం ఆలపించడాన్ని తప్పుబడుతున్నారు. 


భూములనేం చేస్తారో...రైతులనేదరికి చేరుస్తారో..!?

అమరావతి నిర్మాణంలో భాగంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల కారణంగా రాజధాని గ్రామాల్లోని భూములు గత ఐదారేళ్లలో తమ రూపురేఖలను పూర్తిగా కోల్పోయాయి. సువిశాల రహదారులు, సచివాలయం, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌, ప్రభుత్వ నివాస సముదాయాలు, విద్యా సంస్థలు, ఉద్యానవనాలు, భారీ వంతెనలు.. ఇత్యాది వాటితో ఒకప్పటి తమ సేద్యయోగ్యతను పోగొట్టుకున్నాయి. గతంలో వాటికి ఉన్న నీటి వనరులు, మురుగునీరు పారే వసతులు, గట్లు తదితరాలన్నీ కనుమరుగయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. రాజధానిలోని భూముల్లో పెక్కింటిని ఇప్పుడు చూస్తే ఒకప్పుడు వాటిల్లో సస్యసిరులు పొంగి పొర్లేవంటే నమ్మడం ఓపట్టాన సాధ్యం కాదు! ఈ నేపథ్యంలో.. మూడు రాజధానుల పేరిట అమరావతికి మంగళం పాడితే.. దానికి భూములిచ్చిన వేలాదిమంది రైతుల గతి ఏమిటని సామాజికవేత్తలు నిలదీస్తున్నారు.


వారు త్యాగం చేసిన వేలాది ఎకరాలు ఏమవుతాయో, వాటిని జగన్‌ సర్కారు ఏం చేద్దామనుకుంటోందో తెలియదు. రైతులిచ్చిన భూములను వారికి తిరిగి ఇచ్చేస్తారనుకున్నా..అదెలా సాధ్యమో తెలియడం లేదని పలువురు సామాజిక ఉద్యమకారులు అంటున్నారు. వాటిల్లోని వేలాది ఎకరాల్లో రోడ్లు, పలు నిర్మాణాలు వచ్చేశాయి. గట్లూ, పొలిమేరలూ వంటివన్నీ కనుమరుగయ్యాయి. ఈ పరిస్థితుల్లో అమరావతి కోసం పూలింగ్‌ కింద తీసుకున్న భూములను మళ్లీ మునుపటి మాదిరిగా మార్చి, యథాతధంగా వాటి పూర్వపు యజమానులకు అప్పగించడం,  వాటిల్లో వారు అప్పట్లోలా తిరిగి సాగును చేయడం అయ్యేపని కాదని తేల్చేస్తున్నారు.  

Updated Date - 2020-12-17T17:37:07+05:30 IST