శిబిరంపై శివాలు

ABN , First Publish Date - 2020-12-07T14:17:57+05:30 IST

రాజధాని గ్రామమైన ఉద్దండ్రాయునిపాలెంలో..

శిబిరంపై శివాలు

ఉద్దండ్రాయునిపాలెం ఉద్రిక్తం

పోలీసుల సాక్షిగా రైతు శిబిరంపై రాళ్ల దాడి

పేట్రేగిపోయిన మూడు రాజధానుల మద్దతుదారులు 


గుంటూరు(ఆంధ్రజ్యోతి): అమరావతి కోసం.. 355 రోజులుగా ప్రశాంతంగా నిరసనలు సాగిస్తున్న రైతులపై అల్లరి మూకలు పేట్రేగిపోయాయి. ఉద్దండ్రాయునిపాలెంలో రోజూ మాదిరిగానే ఆదివారం కూడా దీక్షకు ఉపక్రమించిన రైతులపై పోలీసుల సాక్షిగా అల్లరి మూకలు రాళ్లతో దాడి చేశారు. గాంధీ చిత్ర పటాన్ని రోడ్డుపైకి విసిరేశారు. జెండాలను పీకేశారు. గోడలపైకి ఎక్కి శిబిరంలోని వారిపై దాడి చేశారు. 


రాజధాని గ్రామమైన ఉద్దండ్రాయునిపాలెంలో అమరావతి కోసం నిరసన దీక్షలు సాగిస్తున్న రైతులు, మహిళలు, చిన్నపిల్లలపై ఆదివారం ఆటోల్లో వచ్చిన కొందరు రాళ్లతో దాడికి దిగారు. శిబిరం వద్ద పోలీసులు కాపలాగా ఉన్న సమయంలోనే దాడి జరిగింది. శిబిరంలోని వారు తేరుకునేలోపే అల్లరి మూకలు గోడలు ఎక్కి దూకి చొచ్చుకువచ్చి శివాలెత్తారు. రైతులు గ్రామంలో నివాసం ఉంటున్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ఇంటిపైకి వచ్చారంటూ అగంతకులు దాడికి దిగారు. శిబిరం ముందు ఉన్న గాంధీ చిత్రపటాన్ని రోడ్డు మీదకు విసిరేశారు. జెండాలను పీకేశారు. శిబిరంలో ఉన్న రైతులు, మహిళలు, పిల్లలపై దాడి చేయగా, బత్తుల కృష్ణ అనే మహిళ గాయపడింది. 


దాడి ఎందుకంటే.. 

రాజధాని గ్రామాల్లో రైతు మహిళలు ఇంటింటికీ వెళ్లి, బొట్టుపెట్టి ఉద్యమంలో భాగస్వాములు కావాలని కొన్ని రోజులుగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఉద్దండ్రాయునిపాలెంలో ఎంపీ నివాసానికి సమీపంలోని ఓ రైతు ఇంటికి వెళ్లి, బొట్టు పెట్టి ఆహ్వానించారు. ఇది గమనించిన ఎంపీ అనుచరులు మూడు రాజధానుల శిబిరంలో వారిని రెచ్చగొట్టారని రైతులు చెబుతున్నారు. దీంతో ఆ శిబిరంలో పెయిడ్‌ ఆర్టిస్టులు అమరావతి శిబిరంపైకి దాడికి వచ్చారన్నారు. 

Updated Date - 2020-12-07T14:17:57+05:30 IST