ఉద్యమంపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2020-08-20T15:14:29+05:30 IST

రాజధానిలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేబినెట్‌ మీటింగ్‌ కోసం..

ఉద్యమంపై ఉక్కుపాదం

తుళ్లూరు/తాడికొండ: రాజధానిలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేబినెట్‌  మీటింగ్‌ కోసం సచివాలయానికి వెళుతున్న నేపథ్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. పోలీసులు పలువురు అమరావతి ఉద్యమ జేఏసీ నేతలను ముందు జాగ్రత్తచర్యగా అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.  మందడంలో దీక్షా శిబిరంలో కూర్చున్న మహిళలను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అమరావతి కొనగాలని రాజధాని రైతులు, రైతుకూలీలు చేస్తున్న ఉద్యమం బుధవారం 246 వ రోజుకు చేరుకుంది. పలుగ్రామాల్లో రైతులు ఆందోళనలు కొనసాగించారు. 


పోలీసుల అదుపులో జేఏసీ నేతలు

పోలీసులు పలువురు అమరావతి ఉద్యమ జేఏసీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేత గాదె శ్రీనివాసరావు, కూనపరెడ్డి రమేష్‌, సనక బుజ్జిలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి, అనంతరం విడుదల చేశారు. దీనిపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో నల్లబెలూన్లు ఎగరవేయడానికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు సిద్ధం అయ్యారు. దీంతో ఆ పార్టీ నేత చిలకా విజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొని తుళ్లూరు స్టేషన్‌లో ఉంచారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ నాయకులు కొమ్మినేని సురేష్‌, వలపర్ల నరసింహ, కంచర్ల గాంధీ, నండూరి విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  


Updated Date - 2020-08-20T15:14:29+05:30 IST