సడలింపుల వ్యవసాయం!
ABN , First Publish Date - 2020-04-21T09:14:16+05:30 IST
లాక్‌డౌన్ సడలింపుతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇది కొంతమేర బాగానే వున్నా... పనులకు వ్యవసాయ కార్మికులు ఆటోలు, ట్రాక్టర్లలో భౌతికదూరం పాటించకుండా ప్రయాణించడం ప్రమాదకరంగా...

ఆంద్రజ్యోతి - మచిలీపట్నం
లాక్‌డౌన్ సడలింపుతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇది కొంతమేర బాగానే వున్నా... పనులకు వ్యవసాయ కార్మికులు ఆటోలు, ట్రాక్టర్లలో భౌతికదూరం పాటించకుండా ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. కొవిడ్ -19 కారణంగా జిల్లావ్యాప్తంగా గత నెల 22 నుంచి లాక్ డౌన్ విధించడంతో రైతులు వ్యవసాయ పనులకు, తాము పండించిన పంటలను విక్రయించేందుకు అనేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి భౌతిక దూరం పాటిస్తూ, ముఖాలకు మాస్క్‌లు కట్టుకుని పొలాల్లో కనీస జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితేదూర ప్రాంతాలకు ఆటోలు, ట్రాక్టర్లలో పనులకు వెళ్లే సమయంలో వ్యవసాయ కూలీలు భౌతికదూరం పాటించకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఏ మండలంలోనివారు అదే మండలంలో పనులు చేయాలనే నిబంధనలు విధించారు. స్థానిక నిబంధన అయితే పాటిస్తున్నారు కానీ పొలాలకు వచ్చి వెళ్లే సమయాల్లో భౌతిక దూరం పాటించకపోవడంపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే ఉపాధి పనుల్లో కూడా పలు చోట్ల కూలీలు మాస్కులు లేకుండా పనిచేయడం కనిపించింది.
2.40 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి
ఈ ఏడాది జిల్లాలో 2.40 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి జరుగుతుందని ఉద్యానశాఖ అధికారుల అంచనాగా ఉంది. ఇప్పటివరకు 46 వేల టన్నుల మామిడిని ఎగుమతి చేసినట్టు ఉద్యానశాఖ అధికారి చందు తెలిపారు. ముసునూరు నుంచి 5వేల టన్నులు, అవనిగడ్డ నుంచి 2వేల టన్నుల మామిడి దిగుమతులు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మామిడిని రెడ్‌జోన్ ప్రాంతాల్లో గృహాల వద్దకే తీసుకువెళ్లి మామిడి, అరటిని విక్రయించేలా చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు. మామిడి విక్రయాల్లో ప్యాంకింగ్ చేసేందుకు నిపుణుల అవసరం ఉండటంతో బయటి ప్రాంతాల నుంచి నైపుణ్యం ఉన్న కార్మికులను తీసుకువచ్చేందుకు కలెక్టర్ ఇంతియాజ్ అనుమతులు ఇచ్చారు. జిల్లాలో ఈ సీజన్‌లో ధాన్యం 5 లక్షల టన్నులకు పైగా కొనుగోళ్లు జరగాల్సి ఉంది.
వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విక్రయాలపై ఎప్పటికపుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. కుప్పనూర్పిడిలు, ధాన్యం రవాణా తదితర సమయాల్లో అధికశాతం మంది గుమిగూడకుండా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ధాన్యం రవాణా చేసే లారీలను పోలీసులు నిలిపివేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని రైతులు చెబుతున్నారు. రొయ్యలను హెడ్‌లెస్ చేసి ఇస్తేనే కొనుగోలు చేస్తామని ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు చెబుతుండటంతో జనసంచారం అధికంగా లేని ప్రాంతాల్లో రొయ్యల ఎగుమతుల పనులు చేస్తున్నారు. కూలీలు భౌతిక దూరం పాటించేలా వ్యాపారులు చర్యలు తీసుకుంటున్నారు.