రైతులను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-12-06T06:28:22+05:30 IST

రైతులను ఆదుకుంటాం

రైతులను ఆదుకుంటాం
తుమ్మలపాలెం వద్ద రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న వ్యవసాయశాఖ స్పెషల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, జేసీ మాధవీలత

 కౌలు రైతులకూ ఇన్‌పుట్‌ సబ్సిడీ

 ఈ-క్రాప్‌ బుకింగ్‌కు మరో అవకాశం

వ్యవసాయశాఖ స్పెషల్‌ సెక్రటరీ  పూనం మాలకొండయ్య

 ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం/గూడూరు:

నివర్‌ తుఫాను కారణంగా వరి, ఇతర పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయశాఖ స్పెషల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య భరోసా ఇచ్చారు. జేసీ మాధవీలత, ఆర్డీవో ఖాజావలి, వ్యవసాయశాఖ జేడీ మోహనరావుతో కలిసి గూడూరు, తుమ్మలపాలెం, చిట్టిగూడూరు, కంకటావ, కత్తులవానిపాలెం, శారదాయిపేటలో  దెబ్బతిన్న వరిపొలాలను శనివారం ఆమె పరిశీలించారు. గూడూరు, తుమ్మలపాలెం గ్రామాల్లో ఇంకా నీటిలోనే ఉన్న పంటను పరిశీలించిన ఆమె రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుమ్మలపాలేనికి చెందిన జడా నాంచారయ్య, తోటబాలయ్యకు చెందిన పొలాల్లో నీటమునిగి ఉన్న వరిపంటను, కోతకోసి ఓదెలపై ఉన్న వరిని ఆమె పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా వరి నేలవాలి నీట మునిగిందని, కంకులు మొక్క మొలిచి పోయాయని, దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరానికి రూ.24 వేలకు పైగా పెట్టుబడిగా పెట్టామని వారు వాపోయారు.

ముఖ్యమంత్రికి నివేదిక పంపుతాం

గూడూరులోని రైతు భరోసా కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూనం మాలకొండయ్య పరిశీలించి, ఆర్‌బీకే ద్వారా రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకునేలా ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తానన్నారు. తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిందని ఆమె తెలిపారు.

కౌలు రైతులను ఆదుకోవాలి 

వక్ఫ్‌భూములు, దేవదాయశాఖకు చెందిన భూములను కౌలు చేస్తున్నామని, పంట నష్టపరిహారం, పంట బీమా వివరాల్లో వక్ఫ్‌, దేవాదాయ శాఖ భూములుగానే నమోదు చేస్తున్నారని, కౌలు రైతుల పేర్లు నమోదు చేయడం లేదని వ్యవసాయశాఖ స్పెషల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్యతో రైతులు చెప్పారు. పంట నష్టపరిహారం అందకుంటే ఆత్మహత్యలే శరణ్యమని గూడూరుకు చెందిన శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ-క్రాప్‌ నమోదు సక్రమంగా జరగలేదని మరికొందరు రైతులు ఫిర్యాదు చేయగా, ఈ-క్రాప్‌ బుకింగ్‌కు ఎడిట్‌ ఆప్షన్‌ ఇస్తామన్నారు. కౌలు రైతుల పేర్లు పంట నష్టపరిహారం జాబితాలో నమోదు చేసేందుకు ప్రత్యేక ఆప్షన్‌ ఇస్తామన్నారు. మళ్లీ  పంటకోత ప్రయోగాలు చేసి, దిగుబడులు ఏ మేరకు తగ్గాయో వివరాలు సేకరిస్తామన్నారు.  డిసెంబరు నెలాఖరులోగా పంట నష్టపరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

  1.08 లక్షల హెక్టార్లలో పంటనష్టం  

జిల్లాలో నివర్‌ తుపాను కారణంగా ఇప్పటివరకు 1,08,044 హెక్టార్లలో వరి, 117 హెక్టార్లలో మినుము, 175 హెక్టార్లలో పత్తి, 45 హెక్టార్లలో వేరుశెనగ పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాగా ఉందని తెలిపారు. 35,270 హెక్టార్లలో పంటనష్టం అంచనాలపై సర్వే చేయగా 29,432 హెక్టార్లలో పంటల దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు వ్యవసాయశాఖ స్పెషల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్యకు నివేదిక సమర్పించారు. పౌర సరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ రాజ్యలక్ష్మి, ఏడీ మణిధర్‌ ఉన్నారు. 

Updated Date - 2020-12-06T06:28:22+05:30 IST