గుండె చికిత్సలో అత్యాధునిక ఓసీటీ
ABN , First Publish Date - 2020-03-03T10:43:53+05:30 IST
గుండె వ్యాధుల చికిత్సలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వ్యాధి నిర్ధారణ సులభమైందని, ‘ఎవిడెన్స్ బేస్‌డ్ మెడిసిన్’
- నగరంలోని రమేష్ ఆసుపత్రిలో వర్క్‌షాప్ ప్రారంభం
విజయవాడ, ఆంధ్రజ్యోతి: గుండె వ్యాధుల చికిత్సలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వ్యాధి నిర్ధారణ సులభమైందని, ‘ఎవిడెన్స్ బేస్‌డ్ మెడిసిన్’ విధానాల సహాయంతో కచ్చితమైన చికిత్సా విధానాన్ని ఎంపిక చేసుకోవటానికి వంద శాతం అవకాశాలు మెరుగుపడ్డాయని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. నగరంలోని రమేష్ హాస్పిటల్స్‌లో సోమవారం నిర్వహించిన ఆప్టికల్ కోహెరెన్స్‌టోమోగ్రఫీ (ఓసీటీ) వర్క్‌షాప్ నిర్వహించారు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ వాన్ గూన్స్ అతిథిగా హాజరయ్యారు. రమేష్ హాస్పిటల్స్ ఎండీ, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.రమేష్‌బాబు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ హరిత, డాక్టర్ భాస్కర్ నాయుడు, డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ రాజా రమేష్, డాక్టర్ కీర్తిక, డాక్టర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండె జబ్బుల నిర్ధారణకు సంబంధించి తాజాగా అందుబాటులోకి వచ్చిన ఆప్టికల్ కోహెరెన్స్‌టోమోగ్రఫీ టెక్నాలజీని ఆసుపత్రిలో డాక్టర్ రాబర్ట్ వాన్ గూన్స్ ప్రారంభించారు. అనంతరం ఆయనతో కలిసి రమేష్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్‌బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుండె రక్తనాళాల్లో కొవ్వు పరిమాణాలు తెలుసుకోవటానికి యాంజియోగ్రామ్ పరీక్ష చేయాలని, రక్తనాళాల్లో బ్లాక్స్ 40 నుంచి 80 శాతం ఉన్నప్పుడు వ్యాధి నిర్ధారణ చేయడానికి వైద్యులు అయోమయానికి గురవుతారన్నారు. రక్తనాళాల్లో బాక్స్ ఉన్న రోగికి యాంజియోప్లాస్టీ చేయాలా? బైపాస్ సర్జరీ చేయాలా? మందులు వాడితే సరిపోతుందా? అనేది నిర్ధారించే క్రమంలో కొన్ని పొరపాట్లు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఓసీటీ ద్వారా కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేసే అవకాశం ఏర్పడుతుందని వివరించారు. గుండె రక్తనాళాల్లో పూడిక ఏర్పడితే దాని స్వభావాన్ని తెలుసుకోవటానికి గుండె లోపలికి పంపించే ‘క్యాథటర్’ చివర్లో చిన్న కెమెరా ద్వారా పూడికలో కొవ్వు శాతం (బ్లాక్), కాల్షియం, రక్తనాళాల స్వభావం గురించి కచ్చితంగా తెలుసుకునేందుకు ఆప్టికల్ కోహెరెన్స్‌టోమోగ్రఫీ ఉపయోగపడుతుందని రమేష్‌బాబు వివరించారు. రాష్ట్రంలో మొదటిసారిగా కో-రిజిస్ట్రేషన్, ఆప్టివ్యూ, ఆర్‌ఎఫ్‌ఆర్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లేటెస్ట్ మోడల్ ఓసీడీ టెక్నాలజీని తమ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాబర్ట్ వాన్ గూన్స్ మాట్లాడుతూ ఇన్‌ఫ్రారెడ్ లైట్ సహాయంతో ఇంట్రా కరోనరీ ఫిజియాలజీ, లీజన్ మార్ఫాలజీ, స్టెంట్ స్టెబిలిటీ, కరోనరీ కాల్సిఫికేషన్, కరోనరీ త్రొంబస్, కరోనరీ డిసెక్షన్ సమాచారాన్ని 3 డైమెన్షన్స్ ఇమేజింగ్ టెక్నాలజీతో అత్యంత స్పష్టంగా అందజేస్తుందన్నారు.