గాంధీ సహకార బ్యాంకు పాలన పక్కదారి

ABN , First Publish Date - 2020-12-27T06:23:43+05:30 IST

గాంధీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు ప్రతిష్ఠ మసకబారుతోంది. కొందరు డైరెక్టర్ల పనితీరు కారణంగా నష్టాల బాట పడుతోంది.

గాంధీ సహకార బ్యాంకు పాలన పక్కదారి

అడ్డగోలుగా ఉద్యోగుల నియామకాలు

నష్టాల బాటలో మూడు బ్రాంచీలు

అడ్డదారిలో చైర్మన్‌, కార్యదర్శి, కో-ఆప్టెడ్‌ డైరెక్టర్ల నియామకం

మితిమీరుతున్న రాజకీయ జోక్యం.. ఆందోళనలో బ్యాంకు సభ్యులు


గాంధీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు ప్రతిష్ఠ మసకబారుతోంది. కొందరు డైరెక్టర్ల పనితీరు కారణంగా నష్టాల బాట పడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆదర్శనీయంగా నిలిచిన ఈ బ్యాంకులో ప్రస్తుతం పాలన గాడి తప్పింది. సహకార శాఖ నిబంధనలను పాతరేస్తూ,  కొందరు డైరెక్టర్లు సొంత ఎజెండాను అమలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బ్యాంకు కార్యకలాపాల్లో రాజకీయ నాయకుల జోక్యం మితిమీరుతోంది. దీనికి నిదర్శనమే కో-ఆప్టెడ్‌ సభ్యుల నియామకం. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : విజయవాడలోని గాంధీ కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు ఎంతో చరిత్ర ఉంది. 1928లో ఏర్పడిన ఈ బ్యాంకు క్రమంగా విస్తరిస్తూ, ప్రస్తుతం పొరుగు జిల్లాల్లోనూ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన బ్యాంకు కొందరు డైరెక్టర్ల పనితీరు కారణంగా నష్టాల బాట పట్టడం బ్యాంకు సభ్యులతో పాటు, వేలాదిమంది ఖాతాదారులనూ ఆందోళనకు గురిచేస్తోంది. 


నియామకాల్లో ఇష్టారాజ్యం

బ్యాంకు చైర్మన్‌, కార్శదర్శి మొదలు కో-ఆప్టెడ్‌ సభ్యుల నియామకం వరకు ఉన్నతస్థాయిలో జరిగిన పలు నియామకాల్లో సహకార నిబంధనలకు తూట్లు పొడిచారు. కొద్ది నెలల క్రితం బ్యాంకు చైర్మన్‌ వేమూరి బసవకుటుంబరావు అలియాస్‌ చిట్టియ్య కన్నుమూశారు. నిబంధనల ప్రకారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు ఉపాధ్యక్షుడిని ఇన్‌చార్జిగా నియమించాల్సి ఉంటుంది. కానీ కో-ఆప్టెడ్‌ డైరెక్టర్‌ను చైర్మన్‌ను చేశారు. ఇది సహకార నిబంధనలకు విరుద్ధం. ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న వ్యక్తి కంటే సీనియర్లున్నా, వారిని కాదని ఈయన్ని నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. కో-ఆప్టెడ్‌ డైరెక్టర్ల నియామకంలోనూ అడ్డదారే. ఆర్బీఐ రిటైర్డ్‌ అధికారులను, బ్యాంకింగ్‌ రంగంతో సంబంధం ఉన్న వారిని, ఆడిటర్లను కో-ఆప్టెడ్‌ డైరెక్టర్లుగా  నియమించాల్సి ఉండగా, రాజకీయ పైరవీలతో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఈ పదవుల్లో నియమించారు. నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి సిఫారసుతో ఆయన అనుచరుడికి కో-ఆప్టెడ్‌ డైరెక్టర్‌ పదవి కట్టబెట్టారు. ఈ విధంగా చేస్తే బ్యాంకు మనుగడ ఏమిటన్న ఆందోళన ఖాతాదారుల్లో వ్యక్తమవుతోంది. 


నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు

బ్యాంకు పాలకవర్గం పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసింది. కొవిడ్‌ కారణంగా ఎన్నికలు నిర్వహించకుండా తాత్కాలిక పాలకవర్గంతోనే నెట్టుకొస్తున్నారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పాలకవర్గం మాత్రమే కో-ఆప్టెడ్‌ డైరెక్టర్లను నియమించుకోవాలి. ఇన్‌చార్జి పాలకవర్గానికి ఆ అర్హత లేదు. కానీ నియామకాలు జరిగిపోయాయు. మరోవైపు డైరెక్టర్లు ఎవరికి వారు ఉద్యోగుల నియామకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బంధుత్వమే అర్హతగా, పలువురు డైరెక్టర్లు తమ బంధువులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. సుమారు 25 మంది ఉద్యోగులు ఇలా అడ్డదారుల్లో నియామకాలు పొందినట్లు సమాచారం. ఇక కారుణ్య నియామకంలో పెద్ద మొత్తమే స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 

అడ్డదారిలో ఉద్యోగాలు పొందినవారు బ్యాంకు ఖాతాదారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందినప్పటికీ డైరెక్టర్‌ అండదండలు ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితి. అడ్డగోలు నిర్ణయాల వల్ల ఇప్పటికే మూడు బ్రాంచీలు నష్టాల బాటలో నడుస్తున్నట్టు సమాచారం. నష్టాలు మరింత పెరిగితే భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-27T06:23:43+05:30 IST