ఎన్నికల నిర్వహణకు 2752 పోలింగ్‌ కేంద్రాలు

ABN , First Publish Date - 2020-03-08T12:03:51+05:30 IST

జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై నోడల్‌ అధికారులు, మండల ప్రజాపరిషత్‌, రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు

ఎన్నికల నిర్వహణకు 2752 పోలింగ్‌ కేంద్రాలు

  • అధికారులకు నేడు శిక్షణ

విజయవాడ సిటీ: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై నోడల్‌ అధికారులు, మండల ప్రజాపరిషత్‌, రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో నోడల్‌ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మచిలీపట్నం జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు 2752 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయా పోలింగ్‌ స్టేషన్‌లలో ఓటర్ల సంఖ్య ప్రకారం బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేసుకోవాలన్నారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నారాయణరెడ్డిని నోడల్‌ అధికారిగా నియమించామన్నారు. ప్రస్తుతం 11,535 బ్యాలెట్‌ బాక్స్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఉమారాణి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పర్యవేక్షణకు నోడల్‌ అధికారిగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియమానికి అందుబాటులో ఉన్న 33 వేల మంది ఉద్యోగుల డేటాబేస్‌ను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు, మైక్రోఅబ్జర్వర్లు, పోలింగ్‌ సిబ్బంది నియామకం, బ్యాలెట్‌ పేపర్‌, రూట్‌మ్యాప్‌, ఎన్నికల సిబ్బంది శిక్షణ, వెబ్‌కాస్టింగ్‌, కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌, తదితన అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. జేసీ-2 మోహన్‌కుమార్‌, జడ్పీ సీఈవో సూర్య నారాయణ, డీఆర్డీఏ పీడీ ఆర్‌.శ్రీనివాస్‌రావు, డీపీవో వరప్ర సాద్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నారాయణరెడ్డి పాల్గొన్నారు.


టెన్త్‌ పరీక్షల తేదీల్లో మార్పు: డీఈవో


మచిలీపట్నం టౌన్‌: స్థానిక ఎన్నికల దృష్ట్యా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు డీఈవో ఎం.వి. రాజ్యలక్ష్మి తెలిపారు. ఈనెల 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 31న మొదటి భాష, ఏప్రిల్‌ 1న ఓరియంటల్‌ లాంగ్వేజ్‌, 3న హిందీ, 4న ఇంగ్లీషు పేపర్‌ 1,  6న ఇంగ్లీషు పేపర్‌ 2, 7న మ్యాథ్స్‌ 1, 8న మ్యాథ్స్‌ 2, 9న జనరల్‌ సైన్సు పేపర్‌ 1, 11న జనరల్‌ సైన్స్‌ పేపరు 2, 13న సోషల్‌ స్టడీస్‌ పేపరు 1, 15న సోషల్‌ స్టడీస్‌ పేపరు 2, 16న ఓరియంటల్‌ లాంగ్వేజస్‌, 17న ఒకేషనల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి పరీక్షలు జరుగుతాయని ఆమె వివరించారు. విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన పెంపొందించాలన్నారు.

Updated Date - 2020-03-08T12:03:51+05:30 IST