మొదటి దశలో 1,67,541 ఇళ్లు మంజూరు
ABN , First Publish Date - 2020-12-10T06:06:24+05:30 IST
మొదటి దశలో 1,67,541 ఇళ్లు మంజూరు

25న ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు : కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ సిటీ : ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు లక్షా67వేల541 ఇళ్లు మంజూరైనట్టు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. పేదలందరికీ ఇళ్లపై జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన బుధవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వమే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుందని, దీనికి సంబంధించి ఇళ్ల నిర్మాణ సామగ్రి సమకూర్చేందుకు జిల్లాలో తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ ద్వారా ఈనెల 20లోగా టెండర్లు ఖరారు చేయాలని గృహనిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1,122 లే అవుట్లను సిద్ధం చేసి రోడ్లు తదితర మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 10,471 ఇళ్లు, మైలవరం-20,314, నందిగామ-12,551, పెనమలూరు-20,472, గన్నవరం-25,163, నూజివీడు-10,269, తిరువూరు-684, అవనిగడ్డ-8,460, మచిలీపట్నం-21,236, పెడన-7,737, గుడివాడ-9,808, పామర్రు-14,276, కైకలూరు-6,100, విజయవాడ నగరపాలక పరిధిలో 27,307 ఇళ్లు ప్రభుత్వం నిర్మించి ఇస్తుందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ మంజూరైన ఇళ్లకు ఈనెల 25న శంకుస్థాపనలు నిర్వహించి నిర్మాణ పనులు చేపట్టాలని గృహనిర్మాణశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జేసీలు కె.మాధవీలత, ఎల్.శివశంకర్, గృహనిర్మాణశాఖ ఇన్‌చార్జి పీడీ శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాల్గొన్నారు.