‘వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే..’

ABN , First Publish Date - 2020-03-12T07:24:32+05:30 IST

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును..

‘వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే..’

వైఎస్‌ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పజెప్పడం హర్షణీయం

విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలి 

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి


కడప(ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తెలిపారు. బుధవారం కడపలో ఆయన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. 9 నెలలుగా సొంత బాబాయి హత్య కేసులో నిందితులను అరెస్టు చేయలేని అసమర్థుడు సీఎం జగన్‌ అని మండిపడ్డారు. వివేకా హత్య దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ తనను కూడా విచారణకు పిలిచిందన్నారు. కేసులో అమాయకులను ఇరికిస్తారనే అనుమానంతో దర్యాప్తుపై నమ్మకం లేకనే తాను హైకోర్టును ఆశ్రయించానన్నారు.  సీబీఐ విచారణ నిష్పక్షపాతంతో జరగడంతో పాటు దర్యాప్తుపై ప్రభావం పడకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు తీర్పు జగన్‌ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదన్నారు.


వైఎస్‌ వివేకా హత్య జరిగినప్పుడు సీబీఐతో విచారణకు డిమాండ్‌ చేసిన జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాటే మరిచిపోయాడన్నారు. సిట్‌ దర్యాప్తుపై సొంత చెల్లి, పిన్నమ్మకు నమ్మకం లేకనే సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారన్నారు. వారి ధైర్యానికి మెచ్చుకుంటూ వారికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. అమాయకులను ఇరికించేందుకే సిట్‌ను ఏర్పాటు చేశారన్నారు. వివేకా హత్య కేసును సాధారణ మృతిగా చిత్రీకరించడంతో పాటు సాక్ష్యాధారాలను చెరిపేసిన వారిని ఎందుకు సీఎం జగన్‌ అరెస్టు చేయించలేదని ప్రశ్నించారు. హత్యపై ఎన్నెన్నో అనుమానాలున్నాయన్నారు. 1978 సంవత్సరం నుంచి పులివెందుల ప్రజలు వైఎస్‌ కుటుంబానికి పట్టం కడుతున్నారన్నారు.


వివేకా హత్యపై నిజానిజాలు తెలుసుకోవాలని, నియోజకవర్గ వాసులు ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. సీబీఐ విచారణతో హత్య కేసులో నిందితులు ఎవరో తెలుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్‌ పులివెందుల నుంచి 90వేల మెజార్టీతో గెలుపొందారన్నారు. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి నామినేషన్లు వేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ప్రశ్నించారు. 9 నెలల పాలనలో విఫలమవడంతో ప్రజలు ఎక్కడ గుణపాఠం చెబుతారోనని భయంతో టీడీపీ నామినేషన్ల ప్రక్రియను వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు.


సీబీఐకి అప్పగించడం సంతోషంగా ఉంది: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు ఏడాది పూర్తి కావస్తోందని, ఆయన కేసును సీబీఐకి అప్పగిస్తుండడం తనకు సంతోషంగా ఉందని.. ఆయన కుటుంబ సభ్యులకు కూడా న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం దేవగుడి గ్రామంలోని ఆయన స్వగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య 2019 మార్చి 15వ తేదీ జరిగిందని.. నాలుగు రోజుల్లో ఏడాది పూర్తవుతుందన్నారు. సీబీఐ అధికారులు కేసుకు సంబంధించి విచారణ త్వరగా పూర్తి చేస్తే నిందితులు బయటకు వస్తారన్నారు. ఇప్పటికే నిందితులు ఎవరైంది సంబంధిత వారికి తెలుసునన్నారు. ఈ కేసుకు సంబంధించి తనకు గానీ తమ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదన్నారు. 

Updated Date - 2020-03-12T07:24:32+05:30 IST