జగన్ సొంత ఇలాకా పులివెందులలో వీధికెక్కిన విబేధాలు

ABN , First Publish Date - 2020-11-15T14:36:44+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో

జగన్ సొంత ఇలాకా పులివెందులలో వీధికెక్కిన విబేధాలు

కడప : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీ వర్గీయుల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. జమ్మలమడుగు, బి.కోడూరు మండలం పాయలకుంటలో జరిగిన ఘటనలు మరువక ముందే జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నేతలు, వర్గీయుల మధ్య విబేధాలు వీధికెక్కాయి. ఆదివారం ఉదయం పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయలో వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్ళతో ఇరువర్గాల వారు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 8 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గీయులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు.. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇడుపులపాయ పోలీస్ స్టేషన్‌లో గొడవపడ్డ ఇరువర్గీయుల వారు ఫిర్యాదులు చేశారు. అయితే గొడవ ఎందుకు, ఏ విషయంలో జరిగింది..? ఈ గొడవకు కారుకులెవరు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.


ఇటీవల జరిగిన ఘటనలివీ..

ఈ మధ్యే.. బి.కోడూరు మండలం, పాయలకుంట దగ్గర వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సచివాలయ భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఎదుటే ఇరు వర్గాలు బాహ బాహీకి దిగాయి. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మండలానికి చెందిన నాయకుల మధ్య వర్గ విబేధాలు తరచుగా వస్తున్నాయి. శుక్రవారం నాడు జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల చేతిలో రామసుబ్బారెడ్డి అనుచరుడు గురుప్రతాప్‌రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు సాగుతున్నాయి. తన అనుచరుడి హత్యపై రామసుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. హత్య చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రామం మొత్తం నివురు గప్పిన నిప్పులా మారిపోయింది. ఈ రెండు ఘటనలు మరువక ముందే తాజాగా పులివెందులలో వైసీపీలో విబేధాలు రచ్చకెక్కాయి.

Updated Date - 2020-11-15T14:36:44+05:30 IST