మాట తప్పి.. మడమ తిప్పిన సీఎం జగన్
ABN , First Publish Date - 2020-10-14T19:25:39+05:30 IST
రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పి, మడమ తిప్పారని..

ఒకే రాష్ట్రం ఒకే రాజధానికి కలిసిరావాలి
అమరావతి ఐకాస కన్వీనర్ తిరుపతిరావు
ప్రొద్దుటూరు: రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పి, మడమ తిప్పారని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ తిరుపతిరావు విమర్శించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. మంగళవారం అమరావతి ఐకాస కన్వీనర్ తిరుపతిరావు, ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ వరప్రసాద్‌తో కలిసి ప్రొద్దుటూరు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తిరుపతిరావు మాట్లాడుతూ రాయలసీమ నేతలు ముఖ్యంగా కడప జిల్లా నేతలు ఏ విషయంలోనైనా మాట ఇస్తే.. మాట తప్పరు, మడమ తిప్పరనే నాను డి ఉందని, అయితే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పి మడమ తిప్పారని తెలిపారు.
అనాడు ప్రతిపక్ష నేతగా రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వడమే కాకుండా సొంతంగా ఇల్లు నిర్మించుకుని ఎన్నికల ప్రచారంలోను రాజధానిని మార్చమని, సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ అమరావతికి భూములిచ్చిన రైతులను, రాష్ట్ర ప్రజలను దగా చేశారన్నారు. అమరావతి ఉద్యమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు సంఘీభావం తెలిపాలని కోరారు. అమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే దానికి తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. టీడీపీ కడప, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, ఆర్.శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు. 1100 ఏళ్లకు ముందు తుగ్లక్ కూడా ఢిల్లీ నుంచి ఔరంగాబాద్‌ను రాజధానిగా మార్చి ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొన్నాడన్నారు. ప్రస్తుతం జగన్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ మహిళా నాయకురాలు లక్ష్మిప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, సీతారామిరెడ్డి, సిద్దయ్య, సుదర్శన్, వెంకటసుబ్బయ్య, సుధాకర్‌యాదవ్, మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.