జిల్లా ఆస్పత్రిలో రూ.3.5 కోట్లతో యర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2020-12-12T05:13:06+05:30 IST

పుట్టిన పిల్లల్లో శారీరక, మానసిక అరోగ్య సమస్యలకు వైద్యం అందించే దిశగా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా రూ.3.5 కోట్ల తో డిస్ట్రిక్టు యర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ వెల్లడించారు.

జిల్లా ఆస్పత్రిలో రూ.3.5 కోట్లతో  యర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరికిరణ్‌

 ఆస్పత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్‌ హరికిరణ్‌

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 11 : పుట్టిన పిల్లల్లో శారీరక, మానసిక అరోగ్య సమస్యలకు వైద్యం అందించే దిశగా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా రూ.3.5 కోట్ల తో డిస్ట్రిక్టు యర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు  కలెక్టర్‌ హరికిరణ్‌ వెల్లడించారు. శుక్రవారం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం ఆస్పత్రి సమావేశ భవనంలో  కలెక్టర్‌ హరికిరణ్‌ అధ్యక్షతన  జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాచమల్లు విశ్వప్రసాద్‌రెడ్డి హాజరుకాగా, జేసీ సాయికాంత్‌వర్మ, కమిటీ సభ్యులతో, వైద్యాధికారులతో ఆస్పత్రి అభివృద్ధ్ది, సేవలు తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం కలెక్టర్‌ హరికిరణ్‌ విలేకరులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా గుర్తించిన 120 వెనుకబడిన జిల్లాలో కడప జిల్లా కూడా ఉందని, అయితే కొవిడ్‌ సేవలు అందించిన విషయంలో మంచి ప్రగతిని సాధించిన క్రమంలో నీతి అయోగ్‌ సంస్థ జిల్లాకు రూ.5కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో రూ.3.5 కోట్లను ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా డిస్ట్రిక్టు యర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌కు కేటాయించామని, ఏడాదిలోపు పూర్తి చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలోని కొవిడ్‌ హాస్పిటల్‌లో 8800 మందికి వైద్యసేవలు అందివ్వగా, ఇందులో కేవలం 69 మంది మాత్రమే వేర్వేరు కారణాలతో మృతి చెందారన్నారు. ఈ లెక్కన చూస్తే మృతుల శాతం 0.8 శాతమేనని చెబుతూ, కొవిడ్‌ సేవలు భేష్‌ అంటూ కలెక్టర్‌ కితాబిచ్చారు. సమావేశానికి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శ్రీధర్‌, ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మిప్రసాద్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ డెవిడ్‌ సెల్వరాజ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శాంతికళ, మున్సిపల్‌ కమిషనర్‌ రాధ, కమిటీ సభ్యులు శివశంకర సత్యనారాయణ, మల్లిఖార్జునరెడ్డి, లక్ష్మినారాయణమ్మ, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ రాణమ్మ, ఏపీఎంఐడీసీ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:13:06+05:30 IST