మేముసైతం..

ABN , First Publish Date - 2020-03-08T10:35:59+05:30 IST

ఆడవారంటే ఒకప్పటిలా అబలలం కాదు.. సబలలం అంటూ నిరూపిస్తున్నారు. మేము కూడా అన్ని రంగాల్లో రాణిస్తాం

మేముసైతం..

అన్నింటా రాణిస్తున్న మహిళలు 


కడప, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : ఆడవారంటే ఒకప్పటిలా అబలలం కాదు.. సబలలం  అంటూ నిరూపిస్తున్నారు. మేము కూడా అన్ని రంగాల్లో రాణిస్తాం అంటూ ఘంటాపథంగా చెబుతున్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార, సామాజిక రంగాల్లో సత్తా చాటుతూ తమకంటూ ఒక ప్రత్యేకత కనబరుస్తున్నారు. ఓ మహిళ తన ఇద్దరి పిల్లలను సైన్యంలోకి పంపి దేశసేవే పరమావధి అని చెబుతున్నారు. మనవళ్లను, మనవరాళ్లను సైతం సైన్యంలో చేర్చేందుకు సై అంటున్నారు.


మరో మహిళ తన భర్త మృతి చెందినా...  ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది.  జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడింది. అయితే తాను పడిన బాధలు మరెవరూ పడకూడదని అక్కడి మహిళలకు అండగా నిలిచి వారిని కష్టాల నుంచి గట్టెక్కించింది. అలాగే ప్రొద్దుటూరుకు చెందిన ఓ మహిళ చిరు వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగి పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇలా ఎంతో మంది మహిళలు తామేమి పురుషులకు తీసిపోమంటూ నిరూపిస్తున్నారు. ఇక ట్రాన్స్‌జండర్స్‌ సైతం ఇప్పుడిప్పడు తాము కూడా సమాజంలో ఒక భాగమని... అవకాశం కల్పిస్తే అన్నింటా రాణిస్తామంటూ చెబుతున్నారు. 


రైల్వేకోడూరు, మార్చి 7: ఈమె పేరు ఇసుకపాటి లక్ష్మీనారాయణమ్మ. స్వగ్రామం రైల్వేకోడూరు మండలంలోని కె.బుడుగుంటపల్లె పంచాయతీ అయ్యవారిపల్లె. అనారోగ్యంతో భర్త మృతి చెందగా ఇద్దరు చిన్న బిడ్డలతో దీనస్థితిలో ఉన్న ఆమెను అప్పులు ఇచ్చినవారు బాకీ చెల్లించాలని కూర్చున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో 2013లో కువైత్‌కు వెళ్లింది. అక్కడ మూడున్నర ఏళ్లపాటు కష్టపడి సంపాదించి అప్పులు తీర్చింది. స్వగ్రామానికి వచ్చిన లక్ష్మీనారాయణమ్మ తన తల్లి గంగమ్మకు పైలేరియా రావడంతో లక్ష రూపాయలకు పాస్‌పోర్టు తాకట్టు పెట్టి చికిత్స చేయించింది. రైల్వేకోడూరుకు చెందిన ఏజెంట్‌ వీసా ఇవ్వడంతో 2017లో మళ్లీ సౌదీకి వెళ్లింది. అక్కడ ఒక శేట్‌ గోడౌన్‌లో పనికి కుదిరింది. కానీ అక్కడ భోజనం లేక, పనులు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో తనను ఇంటికి పంపాలని కోరగా రూ.6లక్షలకు కొన్నామని శేట్‌ చెప్పడంతో లక్ష్మీనారాయణమ్మ నిశ్చేష్టురాలైంది.


శేట్‌ చిత్రహింసలకు తీవ్ర అనారోగ్యం చేయడంతో చికిత్స కోసం సౌదీలోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పాకిస్థాన్‌కు చెందిన ఒకరిని సాయం కోరింది. రైల్వేకోడూరు ఎస్‌ఐగా ఉన్న వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేసి తనను రక్షించాలని కోరింది. స్పందించిన ఎస్‌ఐ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి లక్ష్మీనారాయణమ్మను ఇండియాకు రప్పించారు. ఏజెంటుపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. కువైత్‌, సౌదీల్లో తనలాగే ఇబ్బందులు పడుతున్న వారిని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సహకారంతో స్వదేశానికి రప్పించడంలో లక్ష్మీనారాయణమ్మ కీలక పాత్ర పోషించింది. భర్త మరణించినా కృంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి కష్టాలను ఎదుర్కొని అప్పులు తీర్చింది. గల్ఫ్‌లో బాధలు పడుతున్న మహిళలను పోలీసుల సహకారంతో స్వగ్రామానికి చేర్చి ఆదర్శంగా నిలిచింది. అంతేకాక 2017లో రాజకీయాల్లో చేరి వైసీపీ నియోజకవర్గ మహిళా విభాగం ఇన్‌చార్జిగా పనిచేస్తూ మహిళలకు అండగా నిలిచారు. 


చిరు వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్తగా....

వివాహమయ్యేనాటికి అత్తవారింట చిన్నపాటి వ్యాపారం ఉండేది. కుటుంబంలో ఒకరిద్దరు మాత్రమే వ్యాపారంపై దృష్టిపెట్టేవారు. ఆమె వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో వ్యాపారాన్ని చేపట్టి అంచలంచెలుగాఅభివృద్ధి చేస్తూ నేడు ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఆమె ప్రొద్దుటూరులోని తృప్తిబేకరి యజమాని మాలేపాటి పద్మ. ప్రొద్దుటూరులోని ప్రధాన కూడళ్లలో నేడు రెండు బేకరీలు ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. అయిదేళ్ల క్రితం పరిశ్రమలవాడలో సొంతంగా ఐస్‌క్రీం తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఆరు జిల్లాల్లో ఏజెన్సీలను పెట్టి విక్రయాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా 35 మందికి ఉపాధి అవకాశాలను కల్పించారు. ఇక ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోంది. 


మహిళా అభివృద్ధికి సహకరించాలి

సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళాభివృద్ధికి సహకరించాలి. ప్రభుత్వాలు ఎన్నో పథకాలు, చట్టాలు ప్రవేశపెట్టినప్పటికి క్షేత్రస్థాయిలో చాలా మంది మహిళలు ఇప్పటికి అభివృద్ధిలో  వెనుకబడి ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలపట్ల చిన్నచూపు చూస్తున్నారు. ఆడపిల్లలు అంటే భారంగా భావిస్తున్నవారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా చట్టాలు, పథకాల ప్రవేశపెట్టడమే తమ పని అని అనుకోకుండా క్షేత్రస్థాయిలో  అమలయ్యేలా ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంది.

-మాలేపాటి పద్మ


దేశం కోసం మరొకరినైనా పంపిస్తా..షేక్‌ బనగానిపల్లె మాబూబీ  

 దేశసేవ కోసం మా కుటంబంలో మరొకరినైనా పంపిస్తానని ఎగువరామాపురం గ్రామానికి చెందిన బనగానిపల్లె మాబూబీ తెలిపారు. తన ఐదుగురు కుమారులలో ఇద్దరిని సైన్యంలో చేర్పించారు. మిలటరీకి పంపడం ఎంతో గర్వంగా ఉందని ఆమె తెలిపారు. పెద్ద కుమారుడు పెద్దమస్తాన్‌వల్లి మిలటరీలో పనిచేస్తూ ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మరో కుమారుడు చిన్నమస్తాన్‌వల్లి మిలటరీలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ముగ్గురు కుమారులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్నవయస్సు నుంచే మనవళ్లకు దేశం పట్ల అంకితభావం ఉండాలని నూరిపోస్తున్నారు. మనవళ్లను, మనవరాళ్లను సైన్యంలో చేర్చేందుకు సిద్ధంగా ఉండాలని కొడుకులు, కోడళ్లకు నిత్యం చెబుతుంటారు. దేశసేవ కోసం తమ కుటుంబం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆమె తెలిపారు.

అవకాశం కల్పిస్తే ..

వారు ట్రాన్స్‌జండర్స్‌(హిజ్రాలు)...వీరిని నేటి సభ్య సమాజం హేలన చేస్తూ చిన్నచూపు చూస్తోంది. సమాజంలో వారు కూడా మనుష్యులని, భాగస్వాములని పరిగణించడం లేదు. వారి స్వేచ్ఛను, హక్కులను ఎగతాలి చేస్తోంది. అడుగడుగునా లింగవివక్షతకు గురిచేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య  ట్రాన్స్‌జండర్స్‌లో ఒకరుగా ఉన్న అంబవరం సారిక(సాయినాధరెడ్డి), తేరు అనన్య(శశి)లు తామేమీ స్త్రీ పురుషులకు తక్కువ కాదంటున్నారు. లోక్‌ అదాలత్‌లో శాశ్వత మెంబర్లుగా, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీలో పారాలీగల్‌ వాలంటీర్లుగా రాష్ట్రంలోనే ప్రప్రఽథమంగా నియమితులయ్యారు. లోక్‌ అదాలత్‌లో జడ్జిలతో సమానంగా కూర్చొని అవార్డులలో భాగస్వాములు అవుతున్నారు. 


సమాజంలో మేమూ భాగమే..సారిక, ట్రాన్స్‌ జండర్‌,  లోక్‌ అదాలత్‌ శాశ్వత మెంబర్‌ 

తాము సమాజంలోని మనుష్యుల్లో ఒక భాగమేనని.. మగ, ఆడవారికి తక్కువేమీకాదని... అవకాశాలు కల్పిస్తే ఏ రంగంలోనైనా ప్రతిభను చాటుతాం.  జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్‌ తమను సమాజంలో ఒకరుగా గుర్తించి లోక్‌ అదాలత్‌లో శాశ్వత మెంబరుగా నియమించి లింగవివక్షతకు తావులేదని చాటిచెప్పారు. ఆయన మా జీవితాలల్లో నింపిన న్యాయవెలుగును తోటి ట్రాన్స్‌జండర్స్‌కు పంచుతున్నాం. లోక్‌ అదాలత్‌ బెంచ్‌పై జడ్జిలతో సమానంగా కూర్చొని అవార్డులలో మా ప్రమేయం ఉండడం గొప్ప సదవకాశంగా భావిస్తున్నాం.

చిన్నచూపు చూడటం తగదు: అనన్య, ట్రాన్స్‌జండర్‌, లోక్‌ అదాలత్‌ మెంబర్‌

సమాజంలో ట్రాన్స్‌జండర్స్‌ మనుష్యులేనని... నేటి సభ్య సమాజం గుర్తించకుండా హేలనచేస్తూ చిన్నచూపు చూడడం తగదు. మా స్వేచ్ఛను, హక్కులను ఎగతాళి చేస్తూ అడుగడుగునా లింగవివక్షతకు గురిచేయడం భావ్యం కాదు. ఇటీవల భారత అత్యున్నత న్యాస్ధానం (సుప్రీంకోర్టు) వెలువరించిన తీర్పు ట్రాన్స్‌జండర్స్‌ జీవితాలల్లో వెలుగును నింపుతోంది. వెనుకబడిన తరగతులుగా గుర్తించి విద్య, ఉద్యోగ, ఇతర రంగాలల్లో సమాన అవకాశాలతోపాటు డ్రైవింగ్‌ లైసెన్సు, రేషన్‌కార్డులు, ఎన్నికల గుర్తింపు కార్డులు, పాస్‌పోర్టులలో స్రీ, పురుషలతో పాటు ట్రాన్స్‌ జండర్‌కు ఒక కాలాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.


వీటి అమలుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా పోరాడుతున్నాం. టీడీపీ ప్రభుత్వ పాలనలో ఇంటి స్ధలాలను, పక్కాగృహాలను సాధించుకున్నాం. ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషించిన వారిని శిక్షించడానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం ఎలా ఉందో  ట్రాన్స్‌జండర్స్‌ను హేళనగా దూషిస్తున్న వారిని శిక్షించేందుకు తమకు ప్రత్యేక చట్టం తేవాలి. మా తరుపున చట్టసభల్లో అడగేవారేలేరు. ట్రాన్స్‌జండర్‌ వివక్షత ఒక ట్రాన్స్‌జండర్‌కు మాత్రమే తెలుస్తుంది. కనుక చట్టసభలకు వెళ్లి మా సమస్యలను మేము ప్రస్తావించేందుకు తగిన రిజర్వేషన్లు కల్పించాలి.


Updated Date - 2020-03-08T10:35:59+05:30 IST