కువైత్ కరోనా..
ABN , First Publish Date - 2020-05-24T11:41:19+05:30 IST
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లింకుతో జిల్లాలో తొలిసారిగా కరోనా కేసులు వెలుగుచూశాయి. వారి కాంటాక్టుతో వైరస్ విజృంభించింది.

ప్రవాసాంధ్రులు 112 మంది రాక
రాజంపేట అన్నమాచార్య కాలేజీ క్వారంటైన్‌కు తరలింపు
టెస్టులు చేస్తే 12 మందికి పాజిటివ్ నిర్ధారణ
అప్రమత్తమైన జిల్లా అధికారులు
బంధువులు కలవకపోవడం ఉత్తమం : కలెక్టర్
కడప, మే 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లింకుతో జిల్లాలో తొలిసారిగా కరోనా కేసులు వెలుగుచూశాయి. వారి కాంటాక్టుతో వైరస్ విజృంభించింది. కోలుకుంటున్న సమయంలో తమిళనాడు కోయంబేడు మార్కెట్ కలకలం రేపింది. ఇంతలో కువైత్ ముప్పు ముంచుకొచ్చింది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారితో పాటే కరోనా కూడా జిల్లాకు వలస వచ్చింది. ప్రవాసాంరఽధులకు కరోనా టెస్టులు చేయగా 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కలెక్టర్ సి.హరికిరణ్ శనివారం వెల్లడించారు. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. కువైత్ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలు ఇలా..
కువైత్ కలకలం
కువైత్, గల్ప్ దేశాలకు ఉపాధి కోసం జిల్లా నుంచి వేలాదిమంది వలస వెళ్లారు. కరోనా దెబ్బతో కువైత్ దేశం విలవిల్లాడుతోంది. అక్కడి నుంచి తమను ఇండియాకు పంపమంటూ జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులు భారత్ ఎంబసీకి దరఖాస్తు చేశారు. వారికి అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం జిల్లాకు చెందిన 113 మందిని ప్రత్యేక విమానంలో ఇండియాకు పంపించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆ విమానం తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. వీరిలో 112 మందిని ప్రత్యేక బస్సుల్లో ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, డీఎస్పీ నారాయణస్వామి ఆధ్వర్యంలో రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. రాజంపేటకు చెందిన ఒక వ్యక్తికి హైబీపీ ఉండడంతో విమానాశ్రయం వద్దే క్వారంటైన్లో ఉంచారు. కువైత్ నుంచి వచ్చిన వారికి శుక్ర, శనివారాల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు. 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో పెనగలూరు, రాజంపేట, చిట్వేలికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు.
ఊహించిందే..
కువైత్ నుంచి పంపేటప్పుడు అక్కడ అన్నిరకాల కరోనా టెస్టులు చేస్తారు. పాజిటివ్ లేదని నిర్ధారించాకే ఎయిర్‌పోర్టులో అనుమతిస్తారు. జిల్లాకు చెందిన దాదాపు ఆరువేల మంది తిరిగి స్వస్థలాలకు రానున్నారు. వారంతా వస్తే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికారులు ముందే ఊహించారు. వారు ఊహించిందే నిజమైంది. 112 మంది జిల్లాకు వస్తే వారిలో 12 మందికి పాజిటివ్ వచ్చింది. టెస్టులన్నీ పూర్తయితే కేసులు పెరిగే అవకాశం ఉంది. ఆరువేల మంది జిల్లాకు వస్తే మరిన్ని కేసులు వెలుగుచూస్తాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
అధికారుల్లో భయాందోళన
కువైత్ నుంచి విమానంద్వారా తిరుపతికి చేరుకున్న వారిని రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల క్వారంటైన్‌కు తరలించారు. వారికి ఏర్పాట్లు చేసేందుకు ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, డీఎస్పీ నారాయణస్వామి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, తహశీల్దారు రవిశంకర్‌రెడ్డి, ఎస్ఐ హనుమంతు, డీఆర్వోలు, మున్సిపల్ సిబ్బంది అక్కడికి వెళ్లారు. కువైత్ నుంచి వచ్చిన వారికి దూరంగా ఉంటూ సేవలందించారు. అయినప్పటికీ ప్రవాసాంధ్రుల్లో 12 మందికి పాజిటివ్ రావడంతో అధికారుల్లో ఆందోళన మొదలైనట్లు సమాచారం.
కట్టుదిట్టమైన చర్యలు అవసరం
కువైత్ నుంచి వలస వచ్చిన కరోనా జిల్లాలో వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. జిల్లా అధికారులు కూడా ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. పాజిటివ్ వచ్చిన బాధితులను తక్షణమే కోవిడ్-19 ఆసుపత్రికి తరలించారు. క్వారంటైన్లో ఉన్న వారిని ఇతరులు కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వారి బంధువులు సహకరించాలి: సి.హరికిరణ్, కలెక్టర్
కువైత్ నుంచి వచ్చిన జిల్లా వాసుల్లో 12 మందికి పాజిటి వ్ నిర్ధారణ అయింది. వారం, పదిరోజుల తరువాత రెండో దఫా పరీక్షలు కూడా చేయాల్సి ఉంది. క్వారంటైన్లో ఉన్న ప్రవాసాంధ్రులను 14 రోజుల పాటు కలవకుండా బంధువులు, మిత్రులు సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ 14 రోజులు కఠినంగా ఉంటే వైరస్‌ను ఎదుర్కొని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లవచ్చు. అంతేకాని వచ్చిన వారిని కలవకపోతే ఏమైనా అనుకుంటారేమో అన్న మొహమాటంతో కలిసి.. వైరస్ వ్యాప్తికి కారణం కావద్దు. ప్రజలు సహకరిస్తేనే కరోనాపై విజయం సాధ్యం. కువైత్ నుంచి వచ్చిన వారికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం.
కరోనా అప్డేట్స్
పట్టణం మొత్తం డిశ్చార్జి
కడప 28 20
ప్రొద్దుటూరు 42 36
పులివెందుల 4 4
వేంపల్లె 2 2
బద్వేలు 5 4
మైదుకూరు 4 4
ఎర్రగుంట్ల 12 11
కమలాపురం 1 1
సీకేదిన్నె 1 1
చెన్నూరు 2 2
పుల్లంపేట 1 1
సంబేపల్లె 1 --
జమ్మలమడుగు 1 --
చిట్వేలు 1 --
రాయచోటి 1 --
ఓబులవారిపల్లె 1 --
ఇతరులు 1 --
కువైట్ నుంచి వచ్చిన వారు 12 ---
మొత్తం 124 86
జిల్లాలో కరోనా వైరస్ శాంపిల్స్ రిజల్ట్స్
మొత్తం శాంపిల్స్ 26005
రిజల్ట్స్ వచ్చినవి 24974
నెగటివ్ 24850
పాజిటివ్ 124
రిజల్ట్స్ రావలసినవి 1031
మే 23 వతేదీకి తీసిన శాంపిల్స్ 392