లే నాన్నా.. ఇంటికెళ్దాం..

ABN , First Publish Date - 2020-12-19T05:43:37+05:30 IST

సిద్దవటానికి చెందిన ఆర్టీసీ మెకానిక్‌ రామచంద్రయ్య కుటుంబం తిరుపతి నగరం కొర్లగుంటలో నివాసం ఉంటోంది.

లే నాన్నా.. ఇంటికెళ్దాం..
పెన్నా నదివద్దకు చేరుకున్న మృతుల బంధువులు, సిద్దవటం గ్రామస్థులు

సాయంత్రానికి వస్తానని తిరిగిరాని లోకానికి వెళ్లావా

నీవు లేకుండా ఎట్లా బతికేది

మృతుడి తల్లి కన్నీటిశోకం

పెన్నాలో గల్లంతైన విద్యార్థుల్లో ఆరుగురి మృతదేహాలు లభ్యం

జగదీష్‌ మృతదేహం గుర్తించాల్సి ఉంది

చీకటి పడ్డంతో గాలింపు చర్యలు నిలిపివేత

నేటి ఉదయం తిరిగి కొనసాగింపు

రిమ్స్‌లో పోస్టుమాస్టం.. కన్నవాళ్లకు అప్పగింత


‘‘నాన్న షన్ను లే.. లేనాన్నా ఇంటికెళ్దాం.. సాయంత్రానికి వస్తానని చెప్పొచ్చి ఇలా అయ్యావా..! నీవు బైక్‌ బాగా నడుపుతావ్‌.. నన్ను ఒక్కసారి ఎక్కించుకొని నడుపుదువు రానాన్నా..! వైఫై కావాలంటే ఏపించామ్‌.. ఇప్పుడు ఎవరు వాడాలి నాన్నా..! నీవులేకుండా మేమెలా బతకాలి..!’’ షణ్ముఖశ్రీనివాస్‌ మృతదేహం వద్ద తల్లి మునిపార్వతి దుఃఖంతో ఏడుగురిని పొట్టన పెట్టుకున్న పెన్నమ్మ చిన్నబోయింది. ఆమె ఒక్కరే కాదు.. ఉజ్వలంగా ఎదగాల్సిన కన్నకొడుకులు కనిపించని లోకాలకు వెళ్లారంటూ యువకుల తల్లిదండ్రులందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎవరిని కదిపినా ఉబికివస్తున్న కన్నీళ్లతో దేవుడు ఎంత అన్యాయం చేశారంటూ దుఃఖించారు. గురువారం ఇద్దరి మృతదేహాలను గుర్తిస్తే.. శుక్రవారం నలుగురి మృతదేహాలను గుర్తించారు. మరో యువకుడి మృతదేహం లభించాల్సి ఉంది.


సిద్దవటం/కడప, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సిద్దవటానికి చెందిన ఆర్టీసీ మెకానిక్‌ రామచంద్రయ్య కుటుంబం తిరుపతి నగరం కొర్లగుంటలో నివాసం ఉంటోంది. ఈయన 11 నెలలు క్రితం మృతి చెందారు. ఆయన సతీమణి చంద్రకళ, కుటుంబ సభ్యులు గురువారం స్వగ్రామం సిద్దవటంలో సంవత్సరీకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రయ్య కుమారుడు వెంకటశివ తన మిత్రులు చెన్నకోణం సోమశేఖర్‌ (18), యశ్వంత (16), గాజుల షణ్ముఖశ్రీనివాస్‌ అలియాస్‌ షన్ను (19), ముటికవల్లి తరుణ్‌ (18), కాఫిరెడ్డి జగదీశ్వరరెడ్డి అలియాస్‌ జగదీష్‌ (18), కర్ణి మురళీసతీష్‌ (20), కొనగాలి రాజేష్‌ (18), మరో ముగ్గుర్ని తీసుకొచ్చారు. వీరంతా పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేశారు. సంవత్సరీకం కార్యక్రమం తరువాత మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో 11 మందీ పెన్నా నదికి వెళ్లారు. సరదాగా ఈత కోసం కోట సమీపంలో ఎనిమిదిమంది నదిలో దిగారు. అక్కడ అంతా ఇసుక ఉంది. నీటిలో ఎంజాయ్‌ చేస్తూ అలా.. అలా నదిలోపలికి వెళ్లారు. ఇంతలో ఇద్దరు నీటి సుడిగుండంలో చిక్కుకొని నీటిలోకి జారిపోతుంటే వారిని కాపాడేందుకు వెళ్లి ఒక్కొక్కరుగా నీటిలో గల్లంతైన విషయం తెలిసిందే. గురువారమే స్థానిక జాలర్ల సహకారంతో సోమశేఖర్‌, రాజేష్‌ మృతదేహాలను గుర్తించారు. 


తెల్లవారుజాము నుంచే గాలింపు

శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఓఎ్‌సడీ దైవప్రసాద్‌, కడప సీసీఎస్‌ డీఎస్పీ రంగనాయకులు, ఒంటిమిట్ట సీఐ హనుమంతనాయక్‌ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. సిద్దవటం జాలర్లు (యానాదులు), ఒంటిమిట్టకు చెందిన 10 మంది, అగ్నిమాపక సిబ్బంది 10 మంది, స్పెషల్‌ రెస్క్యూ టీం 30 మంది పవర్‌బోట్లు, అరగోళాల సహాయంతో నదిలో గాలింపు చేపట్టారు. ఉదయం 7.30 గంటల సమయంలో మురళీసతీష్‌, యశ్వంత మృతదేహాలను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో షణ్ముఖశ్రీనివాస్‌ మృతదేహం గుర్తించారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం ఒంటిమిట్ట నుంచి ప్రత్యేక జాలర్లు, అలివి వలలు తెప్పించి నదిలో జల్లెడ పట్టారు. 12.45 గంటల సమయంలో తరుణ్‌ మృతదేహం లభించింది. జగదీశ్వరరెడ్డి అలియాస్‌ జగదీష్‌ మృతదేహం లభించాల్సి ఉంది. కొడుకు మృతదేహం కోసం నాన్న బాలకృష్ణారెడ్డి చీకటి పడే వరకు నది ఒడ్డునే ఉబికివస్తున్న కన్నీటిధారలను తుడుకుంటూ నిరీక్షించారు. చీకట్లు కమ్ముకోవడంతో గాలింపు ఆపేశారు. నదిలో నుంచి వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. వీరి రోదలనలతో రిమ్స్‌ మార్చురీ శోకసంద్రంగా మారింది. 


స్థానిక జాలర్ల కృషి ప్రశంసనీయం

పెన్నా నదిలో గల్లంతైన యువకుల మృతదేహాలను గుర్తించడంలో స్థానిక జాలర్ల (యానాదుల) కృషి ఎంతో ఉంది. గురువారం రెస్క్యూ టీం, ఫైర్‌ సిబ్బంది వచ్చినా.. జాలర్లు వలల సాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. వీరిలో విద్యుత శాఖ కాంట్రాక్టర్‌ గుర్రంపాటి వెంకట సుధాకర్‌రెడ్డి, ఎగువపాళెంకు చెందిన యానాదులు నాగేశ్వరరావు, వెంకటేష్‌ బృందం కృషి ఎంతో ఉంది. తాము ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ పని చేస్తున్నామని, అధికారులే తెలిసి ఏదైనా సాయం చేస్తే కాదనమని జాలరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. మృతదేహాలు వెలికితీయడం అంటే దేవుడికి సాయం చేసినట్లే అనే భావనతో ఈ పని చేస్తున్నానని సుధాకర్‌రెడ్డి వివరించారు.


మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట ఇనచార్జి బత్యాల చెంగలరాయులు డిమాండ్‌ చేశారు. సిద్దవటం పెన్నా ప్రమాద స్థలాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. మృతుల తల్లిదండ్రులను పరామర్శించారు. గాలింపు చర్యల గురించి ఓఎ్‌సడీ దైవప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది బాధాకర సంఘటన అని అన్నారు. సిద్దవటానికి పర్యాటకులు చాలామంది వస్తున్నారని, ఇక్కడి పెన్నా వద్ద రక్షణ చర్యల ఏర్పాటులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎంత ఇచ్చినా కన్నవాళ్ల బాధ తీరనిదని అయినా ప్రభుత్వం రూ.25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
Read more