ముఖ్యమంత్రి గారూ.. శంకుస్థాపనలకే పరిమితమైతే ఎలా..?
ABN , First Publish Date - 2020-07-08T11:06:48+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపనలకే పరిమితమయ్యారని, పనులు కూడా జరిగేట్లు చూడాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ..

కాంగ్రె్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి
వేంపల్లె, జూలై 7: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపనలకే పరిమితమయ్యారని, పనులు కూడా జరిగేట్లు చూడాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సూచించారు. వేంపల్లెలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఏడు నెలల క్రితం స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. 2019 డిసెంబరులో కుందూ-పెన్నా ఎత్తిపోతల పథకానికి రూ.564కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారని, ఇప్పటికీ అతీగతీ లేదన్నారు.
రూ.1350కోట్లతో రాజోలి జలాశయానికి శంకుస్థాపన చేసి ఒక గంప మట్టికూడా తీయలేదన్నారు. రూ.312 కోట్లతో జొలదరాశి జలాశయానికి శంకుస్థాపన చేశారేగానీ ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టలేదని, గాలేరి-నగరి, చిత్రావతి, వెలిగల్లు, కాలేటి వాగు ఎత్తిపోతల పథకానికి రూ.1272కోట్లతో శంకుస్థాపన చేసి ఒక్క అడుగు పనికూడా చేయకపోవడం శోచనీయమన్నారు. శంకుస్థాపనలకే పరిమితమయ్యే ముఖ్యమంత్రిగా కాకుండా చేతల ముఖ్యమంత్రి అనిపించుకోవాలని వైఎస్ జగన్‌కు తులసిరెడ్డి సూచించారు.