రేపు యోగి నరసింహస్వామి 212వ ఆరాధన
ABN , First Publish Date - 2020-03-02T10:28:47+05:30 IST
మండలంలోని తాడి గొట్ల పంచాయతీ కడప స్నిన్నింగ్ మిల్లు వద్ద వెలసిన చిన్నపల్లె యోగి నరసింహస్వామి 212వ ఆరాధన మంగళవారం

సీకేదిన్నె, మార్చి 1 : మండలంలోని తాడి గొట్ల పంచాయతీ కడప స్నిన్నింగ్ మిల్లు వద్ద వెలసిన చిన్నపల్లె యోగి నరసింహస్వామి 212వ ఆరాధన మంగళవారం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. యోగి నరసింహస్వామి ఆరాధనకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుని స్వామివారికి కానుకలు అందిస్తుంటారు. స్వామి వారి మహిమ వల్ల పిల్లలు లేని వారికి పిల్లలు కలగడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గతంలో స్వామివారు జింకల వంక ఉధృతంగా మూడురోజుల పాటు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తుంటే ఇబ్బందులు పడుతున్న బాటసారుల కోసం వంక ప్రవాహాన్ని ఆపి అటు వైపుకు ఇటు వైపుకు బాటసారులను పంపించి తరువాత ప్రవాహాన్ని యదావిధిగా కొనసాగించినట్లు ఇప్పటికీ భక్తులు చెప్పుకుంటుంటారు.
ఆయన జీవ సమాధి అయి 212 సంవత్సరాలు అయిన సందర్భంగా మంగళవారం ఆరాధన నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త గోసుల మునిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు ముందు రోజు రాత్రే వచ్చి స్వామివారికి మొక్కుకుని ఒకరోజు ఉపవాసంతో ఆలయంలో గడుపుతారు. మరుసటి సంవత్సరం వారి కోరికలు తీరిన వెంటనే స్వామి వారికి కానుకలు అందించి మొక్కులు తీర్చుకుంటారు. ఆరాధన సందర్భంగా భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడంతో పాటు చెక్క భజనలు, మధ్యాహ్నం 2 గంటలకు బండలాగుడు పోటీలు నిర్వహిస్తామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ధర్మకర్త తెలిపారు.