రేపటి నుంచి ‘రైతుకోసం’ కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-12-27T05:29:47+05:30 IST

టీడీపీ అదిష్ఠానం అదేశాల మేరకు కడప పార్లమెంట్‌ పరిధిలో ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు రైతు కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.

రేపటి నుంచి ‘రైతుకోసం’ కార్యక్రమాలు

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 26 : టీడీపీ అదిష్ఠానం అదేశాల మేరకు కడప పార్లమెంట్‌ పరిధిలో ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు రైతు కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 28న వైసీపీ 18 నెలల కాలంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను కలిసి పరామర్శిస్తామన్నారు. ఇందులో భాగంగా వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఏ మేరకు పరిహారం అందిందో తెలుసుకుంటామన్నారు. 29న పంట నష్టం నమోదు, పరిహారం అందించే విషయంలో రైతుల పక్షాన ప్రభుత్వ అలసత్వాన్ని ఎండగడుతూ, రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి, పరిహార జాబితాలో లేని రైతులతో వెళ్లి జాబితాలను చింపి, తగులబెట్టాలన్నారు. అనంతరం రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 30న పంట నష్టం, పరిహారం నమోదు కాకుండా నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతులను సమీకరించి, ఎంఆర్‌వో, ఏవో కార్యాలయాలకు పాదయాత్రగా వెళ్లి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో మహిళా రైతులను భాగస్వామ్యం చేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలను ఆయన కోరారు. ఈ కార్యక్రమాలకు తెలుగురైతు పార్లమెంట్‌ అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు పార్టీ నాయకులతో కలిసి పాల్గొనాలని లింగారెడ్డి కోరారు. 

Updated Date - 2020-12-27T05:29:47+05:30 IST