కనీసం రూ.30 లక్షలు..!

ABN , First Publish Date - 2020-03-13T10:49:24+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలను మద్యం, డబ్బు పంపిణీ లేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

కనీసం రూ.30 లక్షలు..!

కార్పొరేటర్‌గా పోటీ చేయాలంటే ఈ మొత్తం ఖర్చు చేయాల్సిందే

ఓ ప్రధాన పార్టీలో డబ్బున్న వారికే టికెట్లు 

నివ్వెరపోతున్న ఆ పార్టీ నేతలు

ఇన్నాళ్లూ పార్టీకోసం కష్టపడినందుకు ఇదేనా బహుమానం అంటూ ఆవేదన


కడప, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను మద్యం, డబ్బు పంపిణీ లేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ అభ్యర్థి పట్టుబడితే జైలుకే. గెలిచిన తరువాత కూడా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు వెల్లడైతే అనర్హత వేటు వేయడంతో పాటు మూడేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సిందేనంటూ సీఎం జగన్‌ కఠినమైన ఆర్డినెన్స్‌ తీసుకువచ్చారు. రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు దేశానికే ఆదర్శంగా నిలవాలన్నది సీఎం ఆలోచన. అయితే ఆయన ఆలోచనను ఆయన సొంత జిల్లాలోనే ఓ ప్రధానపార్టీ తుంగలో తొక్కుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కడప కార్పోరేషన్‌ ఎన్నికల్లో కనీసం రూ.30లక్షలు ఖర్చు చేసేవారికి కార్పొరేట్‌ టికెట్‌ కేటాయిస్తామని, ఓటర్లకు డబ్బు పంపిణీ కాకుండా మిగతా ఖర్చుల కోసం అదనంగా రూ.5లక్షలు ఖర్చు చేయాల్సిందేనని, జనరల్‌ స్థానాల్లో పోటీని బట్టి ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమైనవారికే టికెట్‌ కేటాయిస్తామని ఓ ప్రధాన పార్టీ తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు ఈ వ్యవహారం కడపలో హాట్‌టాపిక్‌గా మారింది. 


కడప కార్పోరేషన్‌లో 50 డివిజన్లున్నాయి. మేయరు పీఠాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బలమున్న చోట కమ్యూనిస్టులు పోటీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆయా పార్టీలు అభ్యర్థుల కోసం మూడు రోజులుగా అన్వేషణ కొనసాగిస్తున్నాయి. నామినేషన్ల దాఖలుకు గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియనుంది. ప్రధాన పార్టీకి చెందిన వారు బీసీ స్థానాల్లో రూ.30 లక్షలు, జనరల్‌ స్థానాల్లో అయితే పోటీని బట్టి ఎంతైనా ఖర్చుకు వెనుకాడకుండా ఉండే వారికి మాత్రమే టికెట్లు ఉంటాయని ఖరాఖండిగా చెప్పేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం కడపలో హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి, కష్టపడ్డ కార్యకర్తలకు కాకుండా కేవలం డబ్బు ప్రామాణికంగా కార్పోరేటరు టికెట్‌ కేటాయించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.


Updated Date - 2020-03-13T10:49:24+05:30 IST